- పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
అమరావతి: తీవ్ర తుపాను మురసు ఒంగోలు సమీపంలో నెల్లూరు–నరసాపురం మధ్య తీరం దాటినట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 3:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగినట్లు తెలిపారు. తుపాను కదలికలను ఆర్టీజీఎస్ (RTGS), విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. తుపాను తీరం దాటినప్పటికీ నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గడచిన ఆరు గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలినట్లు అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100–120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.
నేడు ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, నెల్లూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. తుపాను తీరం దాటే ప్రక్రియ పూర్తయినప్పటికీ వర్షాలు, బలమైన గాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)