విజయవాడ : కారణాలు చూపకుండా ఎన్నికల అధికారులు వేల సంఖ్యలో ఓటర్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈవో) వివరణ ఇవ్వాలని సిపిఐ(యం) కోరింది. దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించే సమయంలో కారణాలు చూపించకుండా వేల ఓటర్ల సంఖ్యలో స్వయంగా ఎన్నికల అధికారులే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. వీటిపై ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివరణ ఇవ్వాలని, వాస్తవాలు వెల్లడించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదన్నారు. గుండుగుత్తగా ఫారం 7 సమర్పించిన వాటిని తిరస్కరించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటి వరకు తొలగించిన, కొత్తగా చేర్పించిన ఓటర్ వివరాలను బహిరంగపరచాలని, రాజకీయ పార్టీలకు లిస్టులివ్వాలని కోరుతున్నామన్నారు. క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పణకు గడువు పెంచకముందు ఆఖరు తేదీ అయిన అక్టోబర్ 10వ తేదీకి ముందు 12 రోజుల పాటు 20,959 మంది పేర్లు తొలగించడానికి సిఫార్సు చేసినట్లు మీడియాలో నిర్దిష్టంగా ఉదాహారణలతో వార్తలు వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాపితంగా వివిధ జిల్లాల్లో తొలగింపునకు ఫారం 7 ద్వారా 40 వేల పేర్లు ఇవ్వబడినాయని, ఇందులో 20,959 పేర్లు ఎన్నికల అధికారులే (ఇఆర్వో, ఎఈఆర్వో) అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మీడియాలో వచ్చాయన్నారు. అయితే ఆ ఓటర్ల తొలగింపుకు నిర్దిష్టమైన కారణాలేవీ పేర్కొనలేదని వార్తలు రావడంతో ఓటర్లలో ఆందోళన, అపోహలు కలుగుతున్నాయన్నారు. ఈసిఐ రూపొందించిన యాప్ వల్లనే కారణాలు చూపించబడటం లేదని ఎన్నికల అధికారులు చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తున్నదన్నారు. నిష్పక్షపాతంగా వాస్తవాలు వెల్లడించేందుకు వీలుగా అవసరమైతే ఈసిఐ యాప్లో తగు మార్పులు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదన్నారు. సర్ ప్రక్రియపై ఇప్పటికే దేశవ్యాపితంగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇలాంటి వార్తలు రావడం ఆందోళనకరమన్నారు. అందువలన ఆంధ్రప్రదేశ్ సిఈవో దీనిపై వాస్తవాలు వెల్లడించాలని సిపిఐ(యం) కోరుతున్నదన్నారు. అర్హులైన ఓటరు ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కారణాలు చూపకుండా ఎన్నికల అధికారులు వేల సంఖ్యలో ఓటర్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈవో) వివరణ ఇవ్వాలి : సిపిఐ(యం)
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 03:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)