శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

AI infiltration - భారత కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ఎఐ చొరబాటు ..!

2 గంటల క్రితం

AI infiltration into Indian computer systems..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 02:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

సైటెక్ : వివిధ సంస్థలు వినియోగిస్తున్న కృత్రిమ మేధ (ఎఐ) ఏజెంట్లు నియంత్రణను దాటి ప్రవర్తిస్తున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా భారతీయ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ఎఐ ఏజెంట్లు అనధికారికంగా ప్రవేశించి, వ్యక్తిగత డేటా, రహస్య సమాచారం, కీలక రికార్డులను యాక్సెస్‌ చేసినట్లు భారత సైబర్‌ భద్రతా సంస్థ సెర్ట్‌-ఇన్‌ (CERT-In) హెచ్చరించింది. ఎఐ మోడళ్ల పరిశోధన, పనితీరు మూల్యాంకనం సమయంలోనూ ఈ తరహా ఉల్లంఘనలు చోటుచేసుకున్నట్లు వెల్లడించింది.


ఈ ఘటనల్లో రెండు రకాల భద్రతా ఉల్లంఘనలను గుర్తించినట్లు సెర్ట్‌-ఇన్‌ తెలిపింది. మొదటి రకం ఉల్లంఘనలో ఎఐ మోడళ్లను అభివృద్ధి చేసే సంస్థలు పరిశోధన, మూల్యాంకన ప్రక్రియలో భాగంగా ఉపయోగించిన ఏజెంట్లు నిర్దేశిత పరిమితులను దాటి ఇతర కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ప్రవేశించినట్లు పేర్కొంది. రెండో రకంలో సైబర్‌ నేరగాళ్లు ఓపెన్‌ సోర్స్‌ ఏజెంటిక్‌ ఎఐ సాధనాలను ఉపయోగించి అనధికారికంగా వ్యవస్థల్లోకి చొరబడినట్లు వివరించింది.


ఈ ఎఐ ఏజెంట్లు సైబర్‌ భద్రతలోని లోపాలను ఆసరాగా చేసుకుని, కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ప్రవేశించేందుకు అవసరమైన లాగిన్‌ వివరాలు, కనెక్షన్‌ సెట్టింగ్‌లను పొందినట్లు సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది. తద్వారా ప్రభావిత సంస్థలకు చెందిన సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్‌ చేయగలిగాయని తెలిపింది. ఈ అనధికారిక ప్రవేశాలను ఆయా సంస్థలు గుర్తించలేకపోయాయని పేర్కొంది. అయితే, బాధిత సంస్థల పేర్లను మాత్రం వెల్లడించలేదు.


సైబర్‌ దాడులను అడ్డుకునేందుకు తగిన భద్రతా చర్యలు తీసుకోని సంస్థలే పలుమార్లు ఇలాంటి ముప్పును ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. బలహీనమైన పాస్‌వర్డ్‌లు, ఇతర సమాచార భద్రతా లోపాలను సరిదిద్దాలని డెవలపర్లు, కంపెనీలకు సెర్ట్‌-ఇన్‌ సూచించింది. ఎఐ ఏజెంట్లపై పరిశోధనలు, పరీక్షలు నిర్వహించే సమయంలో అవి థర్డ్‌ పార్టీ కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ప్రవేశించకుండా నిరోధించే ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని టెక్నాలజీ సంస్థలకు స్పష్టం చేసింది.


ఇదిలా ఉండగా ... గత జులైలో 700 మోసపూరిత ఓపెన్‌ ఎఐ ఏజెంట్లు ‘హగ్గింగ్‌ ఫేస్‌’ సంస్థపై సైబర్‌ దాడికి ప్రయత్నించినట్లు వార్తలు వెలువడ్డాయి. అనంతరం అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు చెందిన వ్యవస్థలతో పాటు ఐక్యరాజ్యసమితి వెబ్‌సైట్‌లను కూడా ఎఐ ఏజెంట్లు యాక్సెస్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ పరిణామాలు ఎఐ సాంకేతికతను వినియోగించే సంస్థలు పటిష్ఠమైన సైబర్‌ భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్