- పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్‌గా ఎస్‌ఎస్ రావత్
- పలువురు ఐఎఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇందుకు సంబంధించిన జివో 1539ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. పాఠశాల, ఉన్నత విద్యాశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ ముఖ్యకార్యదర్శిగా జె శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న కోన శశిధర్‌ను రవాణ శాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జిఎడి(సర్వీస్, హెచ్‌ఆర్‌ఎం) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌ను పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తూ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న బాధ్యతలను అదనంగా అప్పగించింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖ డైరెక్టర్ ఎం శివప్రసాద్(ఐఎఫ్‌ఎస్)ను ప్రస్తుతం చూస్తున్న బాధ్యతలను ఇన్‌చార్జ్‌గా నియమించి ఎపిఎస్‌ఆర్టీసి జెఎండిగా బదిలీ చేసింది. ఎపిపిఎస్‌సి కార్యదర్శి పి రవిసుభాష్‌ను ఎపిటిడిసి ఎండిగా బదిలీ చేస్తూ ఎపిపిఎస్‌సి ఇన్‌చార్జ్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. గోదావరి పుష్కారాలకు స్పెషల్ ఆఫీసర్‌గా మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ సురేష్‌కుమార్‌ను, జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్‌గుప్తాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎపి స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్(ఎపిఎస్‌ఐఆర్‌డి) కమిషనర్ ముత్యాలరాజు రేవును ఆర్కియాలాజీ, మ్యూజియం కమిషనర్‌గా నియమించింది. ఎపిఎస్‌ఐఆర్‌డి కమిషనర్‌గా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓఎస్డి వెంకట కృష్ణను నియమించింది. సెకండరీ హెల్త్ డైరెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబుకు నేషనల్ హెల్త్ మిషన్ ఎండిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. హెప్సిబా రాణిని గృహనిర్మాణ శాఖ ప్రత్యేకకార్యదర్శిగా నియమించడంతో పాటు హౌస్ కార్పొరేషన్ ఎండిగా, ఎపి వీకర్ సెక్షన్స్ హౌసింగ్ ప్రోగ్రాం కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. హౌస్ కార్పొరేషన్ ఎండిగా, ఎపి వీకర్ సెక్షన్స్ హౌసింగ్ ప్రోగ్రాం కమిషనర్‌గా పనిచేస్తున్న పి అరుణ్‌బాబును డ్రగ్ కంట్రోల్ డిజిగా, ఆయుష్ ఇన్‌చార్జ్‌గా డైరెక్టర్‌గా నియమించింది. ఆర్‌టిజిఎస్ సిఇవో ప్రఖార్ జైన్‌ను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రిజనల్ డెవలప్‌మెంట్ ఆథారిటీ కమిషనర్‌గా బదిలీచేసి ఆర్‌టిజిఎస్ బాధ్యతలను ఫైబర్‌నెట్ ఎండి గీతాంజలి శర్మకు అదనంగా అప్పగించింది. సిసిఎల్‌ఎ జాయింట్ డైరెక్టర్ చేతన్ టిఎస్‌కు విపత్తుల నిర్వహణ డిప్యూటీ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. రిటైర్డ్ ఐఏఎస్ ఎ శరత్‌ను టిటిడి జెఇవోగా పునర్ నియామక అవకాశం కల్పించింది. పోస్టింగులు కోసం ఎదురుచూస్తున్న ప్రభల గోపినాథ్‌ను టిటిడి జెఇవో((వైద్యం, విద్య)గా, ఎఎఎల్ పద్మావతిని ఎన్టీఆర్ వైద్య సేవ సిఇవోగా, ఎం జయలక్ష్మీని తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా నియమించింది. ఎపి టౌన్‌షిప్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి బి సునీల్ కుమార్ రెడ్డికి ఎపి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎపిటిడిసి ఎండిగా పనిచేస్తున్న అమ్రపాలి, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రిజనల్ డెవలప్‌మెంట్ ఆథారిటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్ తేజ్ భరత్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండిగా ఉన్న బి అనిల్‌కుమార్ రెడ్డిలను జిఎడిలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.








కామెంట్‌లు (0)