చెకుముకి రాష్ట్రస్థాయి సంబరాలను ప్రారంభించిన శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు
ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి : జెవివి రాష్ట్ర అధ్యక్షులు కెఎస్.లక్ష్మణరావు
ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న పాలకులు: పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి
ప్రజాశక్తి - భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా) : సమాజం కోసం శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారని, విజ్ఞానంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి సీతారామరాజు స్మారక కేంద్రంలో డాక్టర్ ఎంపి.పరమేశ్వరన్ ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సంబరాలు ప్రారంభ సూచికగా జాతీయ పతాకాన్ని జెవివి రాష్ట్ర కోశాధికారి మురళీధరన్, జెవివి పతాకాన్ని జెవివి సీనియర్ నేత పత్తి వీరాస్వామి ఆవిష్కరించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ చుండూరి సాయిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు జెవివి రాష్ట్ర అధ్యక్షులు కెఎస్.లక్ష్మణరావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన మోషేన్‌రాజు ప్రారంభోపన్యాసం చేశారు. అజ్ఞానం కాదు.. విజ్ఞానం వైపు వెళ్లాలనే ముఖ్య ఆలోచనతో సైన్స్ సంబరాలు నిర్వహించడం జెవివి గొప్పతనం అన్నారు. ప్రపంచమంతా విజ్ఞానం వైపు వెళ్తోందని, విజ్ఞానం గొప్పదని చెప్పేందుకు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థలో మార్పులు వచ్చాయని, మతాలు, కులాలు ముందుకు నడిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ... సమాజంలో విలువలు తగ్గుతున్నాయనేదానికి రాప్తాడు ఘటనే నిదర్శనమన్నారు. రాజకీయాల్లో మార్పులు వచ్చాయని, మతాలు, కులాలు ముందుకు నడిపిస్తున్నాయని అన్నారు. ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభ సృజనాత్మకతను బయటకు తీసేందుకు సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంచి సమాజం నిర్మించాలన్నా... సామాజిక కార్యకర్తను తయారు చేయాలన్నా... ముందు వ్యక్తిగతంగా సామాజిక కార్యకర్తగా తయారు కావాలని సూచించారు. జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ సురేష్ మాట్లాడుతూ చెకుముకి సంబరాల మూడు రోజుల షెడ్యూల్‌ను వివరించారు. అనంతరం మీట్ ద సైంటిస్ట్, విజువల్ క్విజ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలోచనా దృక్పథం అవసరం : సిసిఎంబి రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ చీఫ్ సైంటిస్ట్ వేగేశ్న రాధ
నేటి సమాజంలో ఆలోచనా దృక్పథం అవసరమని హైదరాబాద్ సిసిఎంబి రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ చీఫ్ సైంటిస్ట్ వేగేశ్న రాధ అన్నారు. చెకుముకి సంబరాల వేదిక మీద ‘సత్యం కోసం ప్రశ్న’ పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతికాలు - విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం ఆవశ్యకత అనే అంశంపై ఆమె మాట్లాడారు. ఆలోచనా శక్తి, ప్రశ్నశక్తి, కుతుహలం ఉండాలని అన్నారు. విశాఖపట్నం డిఆర్‌డిఒ సైంటిస్ట్, జాయింట్ డైరెక్టర్, ఎన్ఎస్టిఎల్ డాక్టర్ యు.అర్బన్ కుమార్ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు నెలకొల్పాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. వరంగల్ ఎన్ఐటి ప్రొఫెసర్లు ఎ.రామచంద్రయ్య, కె.లక్ష్మారెడ్డి, రాష్ట్ర చెకుముకి సైన్స్ సంబరాలు కన్వీనర్ కెఎంఎంఆర్ ప్రసాద్, జెవివి తెలంగాణ నాయకులు టి.శ్రీనాథ్ మాట్లాడారు. ఈ సభకు చెకుముకి జిల్లా కన్వీనర్ రాపాక వెంకన్న బాబు ఆహ్వానం పలుకగా, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లుల శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు.









కామెంట్లు (0)