- డిజిపి హరీష్ కుమార్ గుప్తా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలీసు క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు డిజిపి హరీష్‌కుమార్ గుప్తా ప్రకటించారు. క్రీడాకారులకు ప్రొఫెషనల్ శిక్షణ, ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. పోలీసు క్రీడా కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు విఐటితో పోలీసు శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ లోగోను డీజీపీ ఆవిష్కరించారు.
మంగళగిరి ఎపిఎస్పి ఆరో బెటాలియన్‌లో శుక్రవారం జరిగిన తొలి ఎపి స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో డిజిపి పాల్గొని ప్రసంగించారు. పోలీసుశాఖలో హోదాలు, పోస్టింగ్‌లు వేరైనా అందరూ ఒకే జట్టులోని సభ్యులేనని చెప్పారు. ‘మనది ఎపి పోలీస్ టీమ్.. మనమంతా ఒకే కుటుంబం’ అంటూ సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. గెలుపు ఉత్సాహాన్నిస్తే.. ఓటమి పాఠం నేర్పుతుందని, రెండింటినీ సమానంగా స్వీకరించడమే క్రీడాస్ఫూర్తి అని పేర్కొన్నారు. విజయం సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ, ఇతరులు మరింత సాధనతో ముందుకు సాగాలని సూచించారు. సమాజంతో పాటు నేరాల స్వరూపం కూడా వేగంగా మారుతోందని తెలిపారు. భవిష్యత్‌లో ఎదురయ్యే కొత్త తరహా సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలంటే పోలీసులకు శారీరక, మానసిక దృఢత్వం అత్యంత అవసరమని చెప్పారు. క్రీడలను పోలీసుల ఉద్యోగ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
పోలీసు క్రీడాకారులు ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌లో పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వారికి ప్రభుత్వం, పోలీసుశాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మహిళా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొనడం కొత్త అధ్యాయానికి నాంది అన్నారు. మహిళా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా పూర్తి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది పోలీస్ స్పోర్ట్స్ మీట్‌ను మరింత విస్తృతంగా, మెరుగైన ప్రమాణాలతో నిర్వహిస్తామని చెప్పారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక కమిటీ, విశ్వవిద్యాలయాలు, క్రీడా సంస్థలు, కోచ్‌లు, సాంకేతిక అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు, స్పాన్సర్లను అభినందించారు. నాలుగు రోజులపాటు హోరాహోరీగా సాగిన పోటీల్లో విశాఖ రేంజ్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ముగింపు కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐజిలు కె.వి.మోహన్‌రావు, ఆకే రవికృష్ణ, బి.రాజకుమారి, సిహెచ్ శ్రీకాంత్, సెంథిల్‌కుమార్, ఏలూరు రేంజ్ ఐజి అశోక్‌కుమార్, డిఐజి అన్బురాజన్, వకుల్ జిందాల్‌తో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)