పారిశ్రామిక అవసరాల కోసం వినియోగం ఎకనామిక్ రీజియన్లపై సమీక్షలో సిఎం
విశాఖ బే-టెక్ సిటీ పేరుతో కొత్తనగరం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కొన్ని జిల్లాల్లో భూమి లభ్యత తక్కువగా ఉందని, ఎపిఐఐసితో సమన్వయం చేసుకుని ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేసుకోవాలని, దీనికోసం అవసరమైతే ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. అమరావతి, విశాఖ, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల ప్రణాళికలపై గురువారం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్‌టిఆర్, కృష్ణా జిల్లాల్లో భూ లభ్యత తక్కువగా ఉంటుందని దీనివల్ల పారిశ్రామికాభివృద్ధికి కొంత ఇబ్బందిగా ఉందని చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రూపొందించిన విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల ప్రణాళికలు అభివృద్ధికి బ్లూప్రింట్ వంటివని తెలిపారు. మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, ఇప్పటివరకు గుర్తించిన పెట్టుబడులను వాస్తవరూపంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పరిశ్రమలు పెట్టుబడుల వల్ల రాష్ట్ర ప్రజల ఆదాయా లు పెరగాలని, జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ముఖ్యమంత్రి అన్నారు. అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికల అమల్లో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కచ్చితంగా ఉండేలా చూడాలని చెప్పారు. ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన వివరాలను ఎప్పటిక ప్పుడు ప్రజలకు వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిటీ ఎకనమిక్ రీజియన్ స్కీం కింద 60 ప్రాజెక్టులకు సంబంధించి రూ.9,180 కోట్లతో సిద్దం చేసి ప్రతిపాదనలను కార్యరూపం దాల్చేలా చూడాలని సిఎం ఆదేశించారు.
విశాఖ బే-టెక్ సిటీ
విశాఖపట్నం ఎకనమిక్ రీజియనల్ ప్రణాళికలో భాగంగా యాంకర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతానికి విశాఖ బే-టెక్ సిటీ అని పేరు పెట్టారు. హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ పేరుతో ఓ నగరాన్ని అభివృద్ధి చేసినట్టుగానే బే టెక్ సిటీ పేరుతో విశాఖకు అనుబంధంగా మరో నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. విజయనగరం, అనకాపల్లి వైపు అభివృద్ధి జరుగుతోందని, ఆ ప్రాంతాల్లో అవసరమైన మేరకు భూమిని ముందుగానే గుర్తించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విశాఖలో ఏడాదిలోగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని, వచ్చే సిఐఐ భాగస్వామ్య సదస్సును అందులోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ప్రతి పారిశ్రామిక ప్రాంతం వద్ద టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలని సిఎం సూచించారు.
గ్లోబల్ సెమీ కండక్టర్ల డిజైన్ క్యాపిటల్‌గా తిరుపతి
తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని సాంకేతిక, పారిశ్రామిక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. తిరుపతిని గ్లోబల్ సెమీ కండక్టర్ల డిజైన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎలక్ట్రానిక్స్, స్పేస్, రోబోటిక్స్, డ్రోన్లు వంటి రంగాలకు అనుబంధంగా డిజైన్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మూడు ఆర్థిక ప్రాంతాల్లో ప్రధాన పరిశ్రమల ఏర్పాటుతో పాటు వాటికి అవసరమైన విడిభాగాలు, సేవలు అందించే ఎంఎస్ఎంఇలను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో మొత్తంగా రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే అత్యధిక శాతం గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 5.70 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారు.
ఎఇఆర్‌లో రూ.4.65 లక్షల కోట్ల ప్రాజెక్టులు
అమరావతి ఎకనమిక్ రీజియన్లో ఆక్వా, కోకో, పామాయిల్ వంటి రంగాలు అతి పెద్ద ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే రూ. 4.65 లక్షల కోట్ల విలువైన 48 ప్రాజెక్టులు నడుస్తున్నాయని తెలిపారు. మచిలీపట్నం, రామాయపట్నం వంటి పోర్టులకు కనెక్టివిటీ అందిస్తే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. క్వాంటం కారిడార్ గా, క్వాంటం మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్, ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణాలు అభివృద్ధికి కేంద్రంగా ఉంటాయన్నారు. మూడు ఆర్థిక ప్రాంతాలకు ప్రముఖ విద్యాసంస్థలను నాలెడ్జ్ పార్టనర్లుగా నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు.
బుద్దిస్ట్ సర్క్యూట్లతో టూరిజం
అరకు, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు సందర్శకులను ఆకర్షించేలా రహదారులు, వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సిఎం చంద్రబాబు చెప్పారు. సూర్యలంక, ఓడరేపు, చినగంజాం, నిజాంపట్నం, దిండి వంటి ప్రాంతాల్లో బీచ్, ఎకో టూరిజానికి అవకాశం ఉందని తెలిపారు. నాగార్జునకొండ, అమరావతి ప్రాంతాలను అనుసంధానిస్తూ బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి ఆ ప్రాంతాన్ని నోటిఫై చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్ల సిఈఓలు యువరాజ్, ముఖేష్ కుమార్ మీనా, సురేష్ కుమార్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)