గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరోబోటిక్‌ శస్ర్తచికిత్సల దిశగా అడుగులు

3 గంటల క్రితం

satyakumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 09:41 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • తొలుత విజయవాడ బోధనాసుపత్రిలో ఏర్పాటు

  • సమీక్షా సమావేశంలో మంత్రి సత్యకుమార్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అత్యంత ఆధునిక వైద్య సేవలను ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య,ఆరోగ్య శాఖ ప‌రిశీలిస్తోందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్‌ ‌యాదవ్‌ ‌తెలిపారు. బోధనాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పన, నిర్మాణాల పురోగతి, ఇతర అంశాలపై మంగళగిరిలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన అధికారులతో చర్చించారు. కొత్త‌గా ఐవిఎఫ్ సెంట‌ర్లు, బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలు, ఇత‌ర అధునిక వైద్య సేవ‌ల‌ను విస్తృతం చేసేందుకు రూ. 1,011 కోట్ల అంచ‌నా వ్య‌యంతో ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసిందని తెలిపారు. ఇందులో ముఖ్యంగా రోబోటిక్‌ శస్త్రచికిత్సలను బోధనాసుపత్రుల్లో దశలవారీగా ప్రవేశ పెట్టాల‌ని యోచిస్తోందని పేర్కొన్నారు. తొలిదశలో విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో రూ.45 కోట్లతో రోబోటిక్‌ శస్త్రచికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని, మ‌లివిడ‌త‌లో విశాఖ కెజిహెచ్‌, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లోనూ రోబోటిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టాల‌ని భావిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తొలిసారిగా ఐదు సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేయనునట్లు వైద్య విద్య డైరెక్టర్‌ ‌విష్ణువర్ధన్‌ ‌మంత్రికి వివరించారు. గుంటూరు, అనంతపురం, విజయనగరం, కాకినాడ, తిరుపతి బోధనాసుపత్రుల్లో వీటిని నెలకొల్పేందుకు రూ.17.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రూ.17కోట్ల అంచనా వ్యయంతో విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రత్యేక అత్యుత్తమ వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రంతోపాటు 11 పాత ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రూ.163.52 కోట్ల వ్యయంతో అవయవ మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.రూ.48 కోట్ల వ్యయంతో విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు బోధనాసుపత్రుల్లో బోన్‌ మేరో ట్రాన్స్‌ప్లాంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రూ.180 కోట్ల అంచనా వ్యయంతో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఏర్పాటు అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. రోగుల అవసరాలకు అనుగుణంగా ఐసియు పడకలు, వెంటిలేటర్లు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన 850 వెంటిలేటర్లకు అదనంగా ఇంకా ఎన్ని అవసరమో క్షేత్రస్థాయిలో గుర్తించాలని సూచించారు. అనంతపురం, మచిలీపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, ఒంగోలులో సమగ్ర క్యాన్సర్‌ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర అణుశక్తి శాఖ నుంచి పొందేందుకు ప్రతిపాదనలు పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్