- పంటల పునరుద్ధరణకు రూ.96 కోట్ల అదనపు సాయానికి వినతి
- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సిఎం చంద్రబాబు లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రెండు వరుస తుఫాన్ల కారణంగా దెబ్బ తిన్న ఉద్యాన పంటల పునరుద్ధరణకు వివిధ కేంద్ర పథకాల కింద అదనపు సాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు, ముఖ్యమంత్రి శుక్రవారం లేఖ రాశారు. ఇటీవల సంభవించిన అర్నబ్, మురసు తుపానుల కారణంగా రాష్ట్రంలో ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. గత నెల 28వ తేదీ, ఈ నెల 2, తేదీలలో వరుసగా రాష్ట్రాన్ని తాకిన రెండు తుపానుల ధాటికి 18 జిల్లాల్లోని 29,960 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, దీనివల్ల 71,576 మంది రైతులు నష్టపోయారని వెల్లడించారు. అర్నబ్ తుఫాను కారణంగా 215 మండలాల్లోని 23,211 హెక్టార్లలోని ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, ఒక్క అరటి పంటే 15,549 హెక్టార్లలో దెబ్బతిందని వివరించారు. మురసు తుఫాను ప్రభావంతో 108 మండలాల్లోని 6,748 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. దెబ్బతిన్న తోటల పునరుద్ధరణ, రైతులను ఆదుకునేందుకు వివిధ కేంద్ర పథకాల కింద అదనంగా రూ.96.33 కోట్ల సాయం అందించాలని కోరారు. అత్యధికంగా అరటి పంట తీవ్రస్థాయిలో దెబ్బతిందని దానిని పునరుద్ధరించేందుకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద హెక్టారుకు రూ.44 వేల చొప్పున నిధులు అందించాలని కోరారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఎండుమిర్చి, కూరగాయల పంటలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల, తదితర జిల్లాల్లో మొవ్వు విరిగిన కొబ్బరి చెట్లకు కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఆర్ధిక సహకారం అందించాలని కోరారు. తోటల పునరుద్ధరణ, దీర్ఘకాలిక ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు త్వరితగతిన సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు.








కామెంట్‌లు (0)