- వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రులను కూటమి ప్రభుత్వం బలోపేతం చేస్తోందని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సెకండరీ ఆసుపత్రుల్లో ముఖ్యమైన వసతులు కల్పించడం ద్వారా రోగులకు త్వరగా వైద్యం అందుతోందని, దీనివల్ల త్వరగా రోగులు కోలుకోవడం వల్ల సదరు కుటుంబాలు వారికి ఉపసమనం లభిస్తోందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా, ప్రాంతీయ, సామాజిక, మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులకు ఆధునిక పరికరాలు, యంత్రాలను సమకూరుస్తున్నామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల బోధనాసుపత్రులపై ఒత్తిడి తగ్గడంతోపాటు రోగులను ఇతర ప్రాంతాలకు పంపే అవసరం క్రమంగా తగ్గుతోందని పేర్కొన్నారు. టెలీ రేడియాలజీ, సీటీ, టిఫా స్కాన్లు, కలర్ డాప్లర్ అల్ట్రాసౌండ్ యంత్రాలు, ల్యాప్రోస్కోపీ పరికరాలతో పాటు నవజాత శిశువుల సంరక్షణ, ప్రయోగశాల పరీక్షలకు అవసరమైన పరికరాలను ఆసుపత్రులకు అందిస్తోందన్నారు. గర్భంలోని శిశువు గుండె పనితీరును గుర్తించేందుకు 200 ఫీటల్ డాప్లర్లు, రోగుల పరీక్షల కోసం అవసరమైన 221 టేబుళ్లు, 307 పరీక్ష దీపాలను కూడా ఆసుపత్రులకు పంపుతున్నాట్లు పేర్కొన్నారు. 24 సామాజిక ఆసుపత్రుల్లో ఒక్క యంత్రానికి రూ.13.54 లక్షలు ఖర్చు చేసి కలర్ డాప్లర్ అల్ట్రాసౌండ్ మిషన్లు సిద్ధం చేశానట్లు పేర్కొన్నారు. ల్యాప్రోస్కోపీ పరికరాల కోసం రూ.5.50 కోట్లతో యంత్రాలు ఏర్పాటు చేసి, కోతలు లేకుండా శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు వీలు కలుగుతోందని, రోగులు త్వరగా కోలుకోవడంతోపాటు దూర ప్రాంతాల్లోని బోధనాసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతోందని తెలిపారు. సెకండరీ ఆసుపత్రులకు 177 మార్చురీ ఫ్రీజర్ ఛాంబర్లను పంపించినట్లు పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)