మరొకరు ఆత్మహత్యాయత్నం
కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల ఆగ్రహం
రహదారిపై ఆందోళన
చెదరగొట్టిన పోలీసులు
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్ : ఫీజులు చెల్లించాలంటూ కళాశాల యాజమాన్యం పెట్టిన వేధింపులు తాళలేక విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన చిత్తూరులో కలకలం రేపింది. ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థిని చికిత్స పొందుతున్నారు. దీంతో ఆగ్రహించిన తోటి విద్యార్థులు తిరుపతి జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. దాదాపు మూడు గంటల పాటు రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. పోలీసులు ఆందోళన స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పేందుకు యత్నించినా వారు ససేమిరా అనడంతో, డిఎస్‌పి ఆధ్వర్యంలో పోలీసు బలగాలు ఆందోళనకారులను చెదరగొట్టాయి.
చిత్తూరులోని ఎస్‌వి సెట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం...కాలేజీ, పరీక్ష ఫీజులు చెల్లించాలంటూ వేధింపులకు గురిచేయడంతో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్న స్రవంతి (18) రెండు రోజుల క్రితం ఇదే కళాశాలకు చెందిన నర్సింగ్ కళాశాల ఆవరణంలోని వసతిగృహంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
అయితే ఇందులో నిజం లేదని కాలేజీ యాజమాన్యం వాదిస్తోంది. కాగా పోలీసుల విచారణలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా గురువారం ఎస్‌వి సెట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన మౌనిక (18) కాలేజీ సమీపంలోని గణేష్ మేనేజ్‌మెంట్ వసతి గృహంలో బుధవారం రాత్రి నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితిలోకి వెళ్లారు. గమనించిన తోటి విద్యార్ధినులు ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఫీజులు చెల్లించాలని వేధించడంతో గత ఆరు నెలల కాలంలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కన్వీనర్ కోటా కింద ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులను ఫీజులు చెల్లించాలంటూ కళాశాల యాజమాన్యం తీవ్ర ఒత్తిడి చేస్తోందని, ఒక్కరోజు ఫీజు చెల్లించడం ఆలస్యం అయితే రూ.ఐదువేలు అపరాధ రుసుం కింద చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. గతంలోనూ ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ఫలితం లేదన్నారు. విచారించి న్యాయం చేస్తామని చిత్తూరు డిఎస్‌పి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎస్‌విసెట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల కోసం విద్యార్థులపై వేధింపులు, ఆత్మహత్యాయత్నాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహమ్మద్ మసూద్ డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)