కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించిన కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్
ప్రజాశక్తి-కాకినాడ : ఏలూరు జిల్లా ఆగిరిపల్లి హీల్ ప్యారడైజ్ లో జరిగిన రాష్ట్రస్థాయి పారా స్పోర్ట్స్ మీట్ లో కాకినాడ జిల్లాకి చెందిన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. రన్నింగ్, లాంగ్ జంప్ అంశాల్లో పోటీ పడి, టోర్నీ మొత్తంగా 7 బంగారం, 4 సిల్వర్,10 రజిత పథకాలు సాధించారు. ఈ పోటీలలో కాజులూరు మండలం నుంచి నలుగురు విద్యార్థులు, కాకినాడ అర్బన్ నుంచి ఒకరు, కాకినాడ రూరల్ నుంచి ఒకరు, పెదపూడి మండలం నుంచి ఇద్దరు, ప్రత్తిపాడు నుంచి ఒక్కరు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా గురువారం కాకినాడ కలెక్టరేట్ లో పారా స్పోర్ట్స్ మీట్ లో విజేతగా నిలిచిన విద్యార్థులు విద్యాశాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ను కలిశారు. జిల్లా కలెక్టర్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో జరిగిన పారా స్పోర్ట్స్మీట్ లో కాకినాడజిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు. తమ లోని బలహీనతలను అధిగమించి జిల్లా వ్యాప్తంగా 21 పతకాలు సాధించడం గొప్ప విశేషమని కలెక్టర్ తెలిపారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తు లోను జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేలా మరింత పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ వీవీవీ. సత్యనారాయణ, సహిత విద్యా సమన్వయకర్త పి గిరిప్రసాద్, క్రీడ కోచులు జయప్రకాష్, ఐసీఈఆర్టీలు కుమార్ రాజు, కల్పనా దేవి, వై వెంకట్, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)