గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

యువ స్వాతంత్ర్య పోరాటాన్ని ఏ పార్టీ నియంత్రించలేదు

23 జులై, 2026

దేశంలో యువ  స్వాతంత్ర్య పోరాటం మొదలైంది...  కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 10:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్

  • నీట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహించాలి

  • ఫెడరల్ వ్యవస్థ ను బలహీన పరచటమే బిజెపి లక్ష్యం

ప్రజాశక్తి -కురుపాం : దేశంలో యువ స్వాతంత్ర్య పోరాటం మొదలైందని, దాన్ని నియంత్రణ చేసే స్థాయి ఏ ఒక్క రాజకీయ పార్టీకీ లేదని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్ అన్నారు. నీట్ లీకేజీ పై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న న్యాయ పోరాటంపై ఆయన స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు అన్ని రకాల అర్హత పరీక్షల నిర్వహణ , సీట్ల కేటాయింపుపై పూర్తి అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వైద్య విద్య అర్హత పరీక్ష (నీట్)ను తమ ఆధీనంలోకి తీసుకోవడం చట్టవ్యతిరేకమన్నారు. 1997లో ఎబివిపి నాయకుడిగా పరీక్ష పేపర్ల లీకేజీ పై పోరాటం చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌ ఇప్పుడు విద్యార్థులపై లాఠీఛార్జి చేయించటం నియంత్రృత్వ పోకడకు నిదర్శనమన్నారు. ఫెడరల్ వ్యవస్థను బలహీన పరిచే అనేక కుట్రలకు కేంద్రం పాల్పడిందని విమర్శించారు. కార్పొరేట్ దిగ్గజాలు తప్ప రైతులు, చిరువ్యాపారులు, చిన్న పరిశ్రమలు, గుత్తేదారులు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని, భారత రాజ్యాంగం ,అభివృద్ధి ,సంక్షేమ ,రక్షణ చట్టాలు దశలవారీగా నిర్వీర్యానికి బిజెపి కుట్ర పూరిత నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు.

​కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహం

దేశంలో జరుగుతోన్న అవినీతి ,అక్రమాలను వెలికి తీసేందుకు ప్రయత్నం చేసినా, ప్రశ్నించినా దేశద్రోహులుగా చిత్రీకరించడం ఇప్పుడు పరిపాటిగా మారిందన్నారు. 12 ఏళ్ల బిజెపి పాలనలో అన్ని తరగతుల ప్రజలు విసిగిపోయి రోడ్డెక్కారని పేర్కొన్నారు. న్యాయ పోరాటం చేసే యువత, మహిళలపై లాఠీఛార్జి , టియర్ గ్యాస్ ప్రయోగం కేంద్ర హోంశాఖ కు సరికాదన్నారు. బిజెపి నిజస్వరూపం తెలుసుకున్న ప్రజలు దేశ వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమయ్యారన్నారు.

పాస్ట్ ట్రాక్ కోర్ట్ తో ప్రయోజనమేమిటీ?

జంతర్ మంతర్ లో జరుగుతున్న పోరాటం పై దాడులు, ఇతర అంశాలపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ సూర్యకాంత్ ‌దృష్టికి న్యాయవాదులు తీసుకువెళ్తే ఆధారాలు కలిగిన వీడియోలు చూసే తీరిక సమయం లేదని సుప్రీం చీఫ్ జస్టిస్‌ ప్రకటన, నీట్ లీకేజీ సమస్యకు పాస్ట్ ట్రాక్ కోర్ట్ లు ఏర్పాటు చేస్తామని, నిరసనలు నిలిపి వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో పాస్ట్ ట్రాక్ కోర్టులతో ఎలాంటి న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్