- సత్యసాయి యూనివర్సిటీ 45వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
శ్రీసత్యసాయి: విద్యార్థులు ఎఐ వంటి ఆధునిక సాంకేతికతలను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, సృజనాత్మకత ఆవిష్కరణలు ఔత్సాహిక పారిశ్రామిక దృక్పథాన్ని పెంచుకోవాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సూచించారు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సత్యసాయి యూనివర్సిటీ 45వ స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సత్యసాయి విద్యాసంస్థలు విలువలతో కూడిన విద్యతో పాటు పరిశోధనలు, సంఘ సేవ, క్రమశిక్షణ, భారతీయ సంస్కృతిని, క్రీడలను ప్రోత్సహిస్తూ విద్యార్థులకు దశ దిశా నిర్దేశిస్తున్నాయని ప్రశంసించారు. సత్యసాయి బోధనలను ఆచరిస్తూ పట్టభద్రులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ బి రాఘవేంద్ర స్వాగత ఉపన్యాసం చేస్తూ 2025-26 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీ సాధించిన విజయాలను, అధ్యాపకులు విద్యార్థుల ప్రతిభ విజయాలను, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ముందుగా గవర్నర్‌కు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె రత్నాకర్, సత్యసాయి సేవాసంస్థల సభ్యులు స్వాగతం పలికారు. ఆ తర్వాత సత్యసాయి మహా సమాధిని గవర్నర్ దర్శించుకున్నారు.
బంగారు పతకాలు, డాక్టరేట్లు ప్రధానం
13 మంది విద్యార్థులకు బంగారు పతకాలను గవర్నర్ ప్రధానం చేశారు. 17 మందికి డాక్టరేట్లు, 530 మందికి డిగ్రీ పట్టాలు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)