ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి : పాఠశాలల్లో విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించరాదని రాష్ర్ట ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రానిక్ రంపంతో దాడి జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు పిల్లలను పాఠశాలలకు పంపే తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకోవాలని పేర్కొంది. మరో ఘటన జరిగే వరకు ఎదురుచూడకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. విద్యార్థుల భద్రతకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించి, తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ చీఫ్ జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు, ప్రహరీ గోడలు నిర్మించడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కాకినాడకు చెందిన హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాప్తాడు పాఠశాల ఘటనను ప్రస్తావిస్తూ విద్యార్థుల రక్షణకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలకు ప్రహరీ గోడల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందుకు అవసరమైన నిధులను కూడా మంజూరు చేస్తోందని విద్యాశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది గుర్రం రామచంద్రరావు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లోనూ యాజమాన్యాలు భద్రతా చర్యలు చేపడుతున్నాయని వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో భద్రతా ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. పాఠశాల రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకొని, గుర్తింపు కార్డులు చూపించిన తర్వాతే తల్లిదండ్రులను సైతం లోపలికి అనుమతిస్తున్న విధానాన్ని ప్రస్తావించింది. విద్యార్థుల రక్షణకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వాటి అమలు వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.








కామెంట్‌లు (0)