ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పౌరసరఫరాల సంస్థలో మండల స్థాయిలో పనిచేస్తున్న హమాలీలకు ఫ్రావిడెండ్ ఫండ్ సమస్యలపై హమాలీ సంఘాలతో సంస్థ అధికారులు నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయని ఎపి పౌరసరఫరాల సంస్థ హమాలీల రాష్ట్ర యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు కె. ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడలోని పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర కార్యాలయంలో హమాలీల సంఘం నేతలతో సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో హమాలీల సమస్యలను ఉమామహేశ్వరరావు వివరిస్తూ.. ప్రకాశం, మార్కాపురం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్య సాయి జిల్లాలో పిఎఫ్ నెంబర్లు రావాల్సిన హమాలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారికి తక్షణమే నెంబర్లు కేటాయించాలని కోరారు. చనిపోయిన, రిటైర్మెంట్ అయిన హమాలీలకు దీర్ఘకాలికంగా పిఎఫ్, క్లెయిమ్స్ పరిష్కారం కోసం పిఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. హమాలీలకు ఇఎస్ఐ పథకం వర్తింపజేయాలని పదేపదే కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని, ఇఎస్ఐ అమలు కాకుండా ఐదేళ్ల క్రితం కోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్ వెంటనే ఉపశంహరించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హమాలీల కూలి రేట్లు పెంపునకు సంబంధించి ఎమ్‌డి ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. పౌరసరఫరాలశాఖ కమిషనరుతో చర్చించి రెండు లేదా మూడు రోజుల్లో జాయింట్ మీటింగు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ పరిధిలో నిర్ణయాలు తీసుకోగల అంశాలకు సంబంధించి హమాలీలకు దసరా బోనస్ రూ.6,500 నుంచి రూ.7 వేలకు, స్వీటు ప్యాకెట్‌కు సంబంధించి రూ.1,300 నుంచి రూ.1,500, ప్రతి ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు మంచినీటి సౌకర్యం కోసం నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1,500లకు, స్వీపర్ జీతం రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెంపు ప్రతిపాదనలు తయారుచేసినట్లు తెలిపారు. ప్రతి 15 రోజులకోసారి జిల్లా మేనేజర్ పరిధిలో హమాలీ సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఫైనాన్స్ మేనేజర్ మంజు భార్గవి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
హమాలీ యూనియన్లతో చర్చలు సఫలం
21 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 21, 2026, 10:31 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)