బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసెమీ కండక్టర్ల తయారీకి తైవాన్ కంపెనీల ఆసక్తి

1 గంట క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 11:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిఎం చంద్రబాబుతో తైవాన్ ప్రతినిధి బృందం భేటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తైవాన్ కంపెనీలు, పరిశ్రమలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం వివిధ అంశాలపై చర్చలు జరిపింది. రాష్ట్ర సచివాలయంలో తైవాన్ పారిశ్రామిక ప్రతినిధుల బృందం.. ముఖ్యమంత్రితో బుధవారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా తైవాన్‌కు చెందిన డెల్టా ఎలక్ట్రానిక్స్, బెన్ క్యూ, సిబిటిసి బ్యాంక్, డైమెర్కో, మాస్టర్ హిల్, నాన్ పావోరెసిన్స్, ఎవర్ క్లియర్ ఎన్విరానమెంటల్ ఇంజినీరింగ్, షెంగ్ హుయ్ టెక్, టెక్ టాప్ ఇంజినీరింగ్, కెఎస్ టెర్మినల్స్, శాండ్ సన్, జిలీ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇంజినీరింగ్, కపెల్లా స్టోర్స్ వంటి అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థల కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైలు, రోడ్డు మార్గాల వంటి పటిష్టమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ సహా రాష్ట్రంలోని తయారీ రంగ ఎకోసిస్టమ్ గురించి ముఖ్యమంత్రి.. తైవాన్ ప్రతినిధుల బృందానికి వివరించారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఐటి, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ సహా ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు విధానపరమైన స్థిరత్వం, వేగంగా అనుమతులు జారీ చేయటంతో పాటు పూర్తి స్థాయి ప్రోత్సాహాన్ని అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భారత్‌లో తమ దేశానికి చెందిన సంస్థలు ఇప్పటికే తయారీ రంగంలో కీలకంగా ఉన్నాయని తైవాన్ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. తయారీ రంగం, సాంకేతికత, పారిశ్రామికాభివృద్ధిలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని చర్చల సందర్భంగా ఏకగ్రీవంగా అంగీకారం కుదిరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్