- కడప ఎంపి అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి
- తాడిపత్రిలో పెద్దారెడ్డి, జెసి ప్రభాకర్‌రెడ్డి మద్దతుదారుల మధ్య భగ్గుమన్న విభేదాలు
- 4 స్కార్పియో వాహనాలతోపాటు 20కిపైగా ద్విచక్ర వాహనాలు దగ్ధం
ప్రజాశక్తి- యంత్రాంగం : కూటమి శ్రేణులు శుక్రవారం రెచ్చిపోయాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జెసి.ప్రభాకర్‌రెడ్డి మద్దతుదారులు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు చేసుకున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామంలో కడప ఎంపి వైఎస్.అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై టిడిపి నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ముగింపు రోజు కావడంతో సింహాద్రిపురం, బలపనూరు, లోమడ క్లస్టర్లలో తమ అనుచరులతో నామినేషన్లు వేయించేందుకు సింహాద్రిపురానికి పులివెందుల నుంచి అవినాష్‌రెడ్డి బయలుదేరారు. దారిలోని అంకాలమ్మ గూడూరు గ్రామంలోకి రాగానే పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన అనుచరులు ఎదురుగా వచ్చారు. ఈ సమయంలో టిడిపికి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు తమ వాహనాలలో నుంచి దిగి అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో, ఎంపీకి చెందిన రెండు ఫార్చునర్ వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల నేపథ్యంలో అవినాష్ రెడ్డి కాన్వాయ్ డ్రైవర్లు యుటర్న్ తీసుకొని తిరిగి కోరుకుంటపల్లి రోడ్డు మీద పులివెందులకు వెళ్లిపోయారు అవినాష్ రెడ్డిపై దాడి జరగడంతో పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి గంటకుపైగా ఉంచారు. దీంతో, భారీగా వైసిపి శ్రేణులు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడి సంఘటనపై ఫిర్యాదు ఇవ్వాలని అవినాష్‌రెడ్డిని పులివెందుల డిఎస్పి మురళి నాయక్ కోరారు. పోలీసులపై తనకు నమ్మకం లేదంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు ఎంపి నిరాకరించారు.
పోలీసుల సమక్షంలోనే నాపై హత్యాయత్నం : ఎంపి అవినాష్ రెడ్డి
పోలీల సమక్షంలోనే టిడిపి రౌడీలు రాళ్లు, పెట్రోల్ బాంబులతో నాపై హత్యాయత్నం చేశారని, తమ వాహనాలను ధ్వంసం చేశారని కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. పులివెందులలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పులివెందుల డిఎస్పి మురళి నాయక్ కు హైకోర్టు ఆదేశాలు చూపించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి వెళ్లిన తర్వాత లోపల బిటెక్ రవి అనుచరులు నామినేషన్లను చించివేస్తున్నారని ఆరోపించారు.
తాడిపత్రిలో రణరంగం
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులైన రాజు, రంగారెడ్డిల వాహనాలకు గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి నాలుగు వాహనాల్లో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం ఉదయం వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న జెసి అనుచరులు పెద్ద ఎత్తున పట్టణంలో పోగయ్యారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పెద్దారెడ్డిని అక్కడి నుంచి ఆయన నివాసానికి తరలించారు. ఈ సమయంలో ఇరుగ్రూపుల మధ్య మొదలైన కవ్వింపు చర్యలు దాడులు, ప్రతి దాడులకు దారితీశాయి. జెసి, కేతిరెడ్డి మద్దతుదారులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. జెసి మద్దతుదారులు మందుగుండు సామగ్రితో దాడి చేయడంతో కేతిరెడ్డికి చెందిన నాలుగు స్కార్పియో వాహనాలతోపాటు ఆయన అనుచరులకు చెందిన 20కిపైగా ద్విచక్ర వాహనాలు మంటలకు ఆహుతయ్యాయి. మరో నాలుగు స్కార్పియో వాహనాల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కేతిరెడ్డి అనుచరుల రాళ్ల దాడిలో జెసి మద్దతుదారులు నలుగురికి గాయాలపాలయ్యారు. ఈ ఘటనల నేపథ్యంలో పట్టణంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.










కామెంట్లు (0)