కర్నూలు : సుగాలి ప్రీతి కేసుకు తొమ్మిదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో .... ఆమె తల్లి పార్వతి చేపట్టిన వీల్ చైర్ యాత్రను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. యాత్ర చేపట్టకుండా అడ్డుకోవడంతో పాటు బంధువులతోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో కర్నూలులో ఉద్రిక్తత నెలకొంది.
సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరగాలనే డిమాండ్‌తో ఆమె తల్లి పార్వతి చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు నుంచి అమరావతి వరకు వీల్‌చైర్ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. తన గోడును ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు అమరావతికి వెళ్లాలని భావించారు. అయితే యాత్రకు అనుమతి లేదని పోలీసులు ఆమెకు తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ ముందుగానే ఆమె నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. యాత్రకు సిద్ధమైన సమయంలోనూ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నేటితో తొమ్మిదేళ్లు ...
సుగాలి ప్రీతి కేసుకు నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2017లో కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. అప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు తమ కుమార్తెకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు. కేసులో దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని వారు పలుమార్లు ప్రభుత్వాలను కోరారు. సంవత్సరాలు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని ప్రీతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ న్యాయం చేస్తామన్నారు .. ఇప్పుడు పట్టించుకోవడం లేదు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పార్వతి గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ తన కుమార్తె కేసులో న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘న్యాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు’’ అంటూ ఆమె వాపోయారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. సుగాలి ప్రీతి కేసులో న్యాయం అందించేందుకు ప్రయత్నించారు. కేసును సిబిఐ దర్యాప్తునకు అప్పగించే ప్రయత్నం చేయడంతో పాటు ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత కూడా అందించారు. అయితే తిరిగి కూటమి అధికారంలోకి వచ్చాక కేసును పక్కన పడేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.







కామెంట్‌లు (0)