విజయవాడ : ఎపి లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో దుష్ప్రచారం జరుగుతోందని, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఇసి) అనిల్‌చంద్ర పునేఠా సూచించారు. ఈ మేరకు ఎస్‌ఇసి ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. అధికారిక గుర్తులను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రచారం నిజమా ? కాదా ? అనే విషయంపై వివరణ కోరుతూ వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. కొందరు షేర్ చేస్తున్నది ఫేక్ షెడ్యూల్ అని, అందులో ఎలాంటి వాస్తవం లేదు అని స్పష్టం చేశారు. వాట్సప్‌లో వస్తున్న ఎన్నికల తేదీలను నమ్మొద్దు.. అని అన్నారు. ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దు అని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేక్ షెడ్యూల్‌ను షేర్ చేసే వారిపై సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని పత్రికా ప్రకటన, మీడియా సమావేశం ద్వారానే వెల్లడిస్తామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు అనధికారిక సమాచారాన్ని విశ్వసించవద్దు అని అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
ఆ ఎన్నికల షెడ్యూల్ ఫేక్.. నమ్మొద్దు : ఎపి ఎస్‌ఇసి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 03:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)