- టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూటమి విజయపరంపర కొనసాగుతోందని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థులు అద్భుత విజయాలు సాధించారని తెలిపారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రెండు, మూడు విడతల పంచాయతీ ఎన్నికలపై టిడిపి నేతలతో శుక్రవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు. రెండు, మూడు విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి మద్దతు అభ్యర్థులు విజయం సాధించాలని కోరారు. ఎన్నికను ఎన్నికగానే చూడాలని, చిన్నదైనా, పెద్దదైనా సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. పోలింగ్ ఎంత ఎక్కువ జరిగితే మెజార్టీలు అంత ఎక్కువ కూటమికి పెరుగుతాయని తెలిపారు. పట్టణ, పరిషత్ ఎన్నికల్లో ఎంత కష్టపడ్డామో పంచాయతీ ఎన్నికల్లోనూ అంత కంటే ఎక్కువ కష్టపడి పని చేయాలని చెప్పారు. జనసేన, బిజెపి కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు లేని నియోజకవర్గాలకు చెందిన నేతలు కూడా పంచాయతీ ఎన్నికల్లో అవసరమైన నియోజకవర్గాల్లో సేవలందించాలని చెప్పారు.ఏమైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
బలహీనంగా ఉన్న చోట గెలవాలని, బలంగా ఉన్న చోట మరింత మెజార్టీలు సాధించాలని పేర్కొన్నారు. వరుస ఓటములతో వైసిపి ఫ్రస్టేషన్‌లోకి వెళ్తోందని, హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసిపి చేసే దాడులు, కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎన్నిక ఏదైనా ప్రజల తీర్పులో మార్పులేదని ఎక్స్‌లో లోకేష్ పొందుపరిచారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనపై అచంచల విశ్వాసం కనబరిచారని పేర్కొన్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు ఘన విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని, ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని తెలిపారు. ఆ నమ్మకం నిలబెట్టుకునే బాధ్యత అందరిపై ఉందని, అహంకారం దరిచేరనీయొద్దని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమవ్వాలని, సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ వరకు కూటమి ప్రజా ప్రతినిధులు కొలువు కావడం రాష్ట్రాభివృద్ధికి మేలి మలుపు కానుందని పేర్కొన్నారు. సమిష్టిగా పనిచేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుదామని, సంక్షేమం - అభివృద్ధికి పాటుపడదామని కోరారు.








కామెంట్‌లు (0)