- భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు రావాలి
- చెలికాని వర్థంతి సభలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ
ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రజలందరూ కలిసి ఉండటమే జాతీయత అని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ అన్నారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ చెలికాని రామారావు 41వ వర్థంతి సభను నిర్వహించారు. తొలుత రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ సి.కృష్ణమోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో 'జాతీయత నాడు-నేడు` అనే అంశంపై శర్మ మాట్లాడారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అని మహాకవి గురజాడ అప్పారావు ఇచ్చిన నినాదాన్ని గుర్తుచేశారు. మనుషులతో నిండేదే దేశమని, దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటేనే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత పాలకుల విధానాల వల్ల నేడు దేశం కేవలం అదాని, అంబాని వంటి కార్పొరేట్ శక్తులకే సొంతంగా మారిపోయిందని, సామాన్య ప్రజలకు కేవలం మట్టి మాత్రమే మిగిలిందని విమర్శించారు. నేటి యువత ఈ పరిణామాలను గమనించాలని కోరారు. అనేక జాతుల కలయికతో రాజ్యాలు ఏర్పడి, అవన్నీ కలిసి నేడు దేశాలుగా అవతరించాయని, కాబట్టి దేశం అనేది ప్రజల సొత్తేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను అదాని, అంబానిల సొత్తుగా మారుస్తోందని ఆరోపించారు. మతం అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, దేశం, మతం రెండు వేర్వేరు అనే విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు. ఈ సత్యాన్ని స్వామి వివేకానంద సైతం పలు దేశాల్లో చాటిచెప్పారని గుర్తుచేశారు. ప్రజల హక్కులను కాపాడుతూ, వారి విశ్వాసాన్ని పొంది ముందుకు సాగడమే అసలైన జాతీయత అన్నారు. దాదాపు వందేళ్ల క్రితం జరిగిన విప్లవ వీరుడు భగత్ సింగ్ బలిదానం నాటి యువతలో జాతీయ భావాన్ని ఉరకలెత్తించిందని, నేటి తరం యువత కూడా అదే స్ఫూర్తిని అందిపుచ్చుకుని దేశ పరిరక్షణ కోసం ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజా వైద్యుడు డాక్టర్ స్టాలిన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అడ్డూరి జగన్నాథవర్మ, పట్టణ ప్రముఖులు గరికపాటి సూర్యనారాయణ, న్యాయవాది ఉండవల్లి గోపాలరావు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు ఆహుతులను అలరించాయి.







కామెంట్‌లు (0)