- తిరుపతిలో యోగాంధ్ర-2027
- అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- ప్రజలతో ‘సమాజ హిత’ ప్రతిజ్ఞ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటింటికీ యోగాతో సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల ఆవరణలో యోగా మందిరాలను నిర్మిస్తామని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన వెల్లడించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ వివిధ ఆసనాలు వేయించారు. ప్రాణాయామం, అనులోమ, విలోమ పద్ధతుల్లో సిఎం యోగాభ్యాసం చేశారు. వివిధ స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఉదయం ఐదు గంటల నుంచి బాబా రామ్‌దేవ్ ప్రజలతో యోగా సాధన చేయించారు. సమాజహితం కోసం బాధ్యతతో వ్యవహరిస్తామని ఈ సందర్భంగా ప్రజలతో సిఎం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...‘యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. మోడీ చొరవతో నేడు 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఫిజికల్, మెంటల్ ఫిట్ నెస్ పెంచేది యోగానేని స్పష్టం చేశారు. యోగాను ప్రజలకు దగ్గర చేసిన బాబా రామ్‌దేవ్ కృషి అమోఘమన్నారు. ఆధ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుందన్నారు. ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
యోగా కోసం ప్రత్యేక పోర్టల్
‘యోగాంధ్ర-2025లో విశాఖలో నిర్వహించి రికార్డులు సృష్టించామని, ప్రధాని మోడీ సమక్షంలో గిన్నిస్ రికార్డులు, ప్రపంచ రికార్డులు సాధించామన్నారు. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. 1.33 లక్షల సెంటర్లలో కోటి మందికి పైగా యోగా సాధన చేస్తున్నారని చెప్పారు. యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తామని పేర్కొన్నారు. స్టాండర్డ్ యోగా ప్రొటోకాల్స్ రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని, యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌ను దూరంగా పెడదామని చెప్పారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్నామని, రసాయన రహిత ఆహారాన్ని స్వీకరిస్తే అనారోగ్యం దరి చేరదని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచనున్నట్లు తెలిపారు. సంజీవని ప్రాజెక్టును ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. సంజీవనిలో యోగాను చేరుస్తామని, రోజుకో గంట యోగా, ధ్యానం, ప్రాణాయామం చేస్తే.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే రాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.07 కోట్లమంది పౌరులు, 2.5 లక్షల మంది శిక్షకులు యోగాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌యుడు, శ్రీనివాస వర్మ, మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, సవిత, యోగా-నేచురోపతి సలహాదారు మంతెన సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)