- మొత్తం లక్ష్యం రూ.800 కోట్లు
- నవంబరు నాటికి రూ.501 కోట్లు
- వసూలైంది రూ.122 కోట్లే
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సంస్కరణల ప్రభావంతో పట్టణ ప్రాంతాల్లో నీటి ఛార్జీల భారం క్రమంగా పెరుగుతోంది. వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ భారం మోయలేని విధంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే వాణిజ్య, గ్రూపు హౌసింగ్ కుళాయిలకు మీటర్లు పెడుతున్న ప్రభుత్వం నెమ్మదిగా అన్ని ఇళ్లకూ పెట్టనుంది. అమృత్ పథకం సంస్కరణలతోపాటు, అంతకుముందు అమలు చేసిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం సంస్కరణలు కూడా ప్రజలపై భారం వేస్తున్నాయి. వాస్తవంగా యుపిఎ ప్రభుత్వ హయాంలో ఉన్న ఎన్‌యుఆర్‌ఎం పథకాన్నే అనంతరం అమృత్‌గా మార్చారు. పట్టణ స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకాన్ని తీసుకొచ్చి కచ్చితంగా అప్పు చేయాల్సిందేననే నిబంధన పెట్టారు. ఈ రూపాల్లో తీసుకునే అప్పును తీర్చాలంటే 100 శాతం కాస్ట్ రికవరీ కింద ఖర్చు మొత్తాన్ని ప్రజల నుండే వసూలు చేయనున్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న నీటి ఛార్జీలు సరిపోవడం లేదని, వీటిని ఇంకా పెంచాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో నీటి ఛార్జీల డిమాండు పాత బకాయిలతో కలిపితే సుమారు రూ.800 కోట్ల వరకూ ఉంది. ఆస్తిపన్నుతో పోలిస్తే నవంబరు నెల వరకూ రూ.510.23 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. దీనిలో రూ.122.83 కోట్లు వసూలు చేశారు. గతేడాది ఇదే సమయానికి రూ.126.39 కోట్లు వసూలైంది. వాస్తవంగా ఇది చాలదని, మరింత పెంచాల్సి ఉంటుందని ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని నగరాల్లో అన్ని కనెక్షన్లకు నీటి మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు నీటి ఛార్జీలే కాకుండా కనెక్షన్ ఛార్జీలు కూడా పెద్దయెత్తున వసూలు చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు కనీసం రూ.8 వేల నుంచి రూ.30 వేల వరకూ వసూలు చేస్తుండగా, పర్రిశమలకు వాటర్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ.54 వేల వరకూ వసూలు చేస్తున్నారు. నీటి అవసరాలు పైపులైను సామర్థ్యం ఆధారంగా ఈ ఛార్జీలు ఉండనున్నాయి. అయితే రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటైతే కచ్చితంగా ప్రతి కనెక్షన్‌కూ నీటి మీటరు బిగించాల్సి ఉంటుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విజయవాడ వంటి నగరాల్లో ఇప్పటికే మీటర్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.








కామెంట్‌లు (0)