మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసముద్రంపై పటిష్ట నిఘా

19 నిమిషాల క్రితం

156525658.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 12:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విశ్వసనీయమైన ఎఐ విస్తరణ

  • క్వాడ్‌ ‌దేశాధినేతల సంయుక్త ప్రకటన

మనీలా : ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సహకారాన్ని మరింత గా బలోపేతం చేసుకోవాలని క్వాడ్‌ ‌దేశాధినేతలు నిర్ణయించారు. మంగళవారం జరిగిన క్వాడ్‌ ‌దేశాధినేతల శిఖిరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌, జపాన్‌ ప్రధాని సనే తకైచి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ ప్రాంతంలో ప్రస్తుత స్థితిగతులను మార్చేందుకు ప్రయత్నించే ఏకపక్ష, బలప్రయోగ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఎగుమతి ఆంక్షలతో సహా ఆర్థికపరమైన ఒత్తిళ్లను ప్రయోగించే అన్ని రకాల ఏకపక్ష చర్యలపైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సముద్ర మార్గాలు స్వేచ్ఛగా, సురక్షితంగా, అంతరాయాలను తట్టుకునే సామర్థ్యంతో కొనసాగాలని, దీనికోసం కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ‘కీలక సరఫరా వ్యవస్థలకు భద్రత కల్పించడం, నౌకాయానం, గగనతల ప్రయాణ స్వేచ్ఛను పరిరక్షించడం, భవిష్యత్తుకు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిని ప్రోత్సహించడం మా లక్ష్యాలు. విశ్వసనీయమైన కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు వాటి వినియోగాన్ని విస్తరిస్తాం’ అని తెలిపారు. ప్రాంతీయ భాగస్వామ్య దేశాలతో కలిసి ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొంటామని, ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూర్చే అవకాశాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. వ్యాపార సంబంధాలను మరింత విస్తరించేందుకు క్వాడ్‌ ‌దేశాల బిజినెస్‌ ‌లీడర్ల ఫోరం సమావేశాన్ని నిర్వహిచాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. 2027లో జరిగే ఈ సమావేశంలో క్వాడ్‌ దేశాలకు చెందిన వ్యాపారవే త్తలు, ప్రభుత్వ అధికారులు, విధానరూపకర్తలు పాల్గొంటారు.

సముద్ర నిఘా సహకారానికి కొత్త వ్యవస్థ

సముద్ర ప్రాంతాల్లో సమాచార మార్పిడిని మెరుగుపరచడంతోపాటు, సముద్ర కార్యకలాపాలపై నిఘా సామర్థ్యాన్ని పెంచేందుకు ‘ఇండో-పసిఫిక్‌ మారిటైమ్‌ సర్వైలెన్స్‌ కొలాబరేషన్‌’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నేతలు ప్రకటించారు.‘సమాచారాన్ని పంచుకోవడం, సముద్ర ప్రాంతాల్లో జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన పెంపొందించడం ద్వారా సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి ఈ కొత్త కార్యక్రమం దోహదపడుతుంది’ అని వారు తెలిపారు. . సముద్రగర్భంలో ఏర్పాటు చేసే కమ్యూనికేషన్‌ కేబుళ్లు అంతర్జాతీయ సమాచార మార్పిడికి కీలకమైనవి కావడంతో, వాటి భద్రత, నిరంతర సేవలు అత్యంత ముఖ్యమని, వీటి భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయంచారు.

విశ్వసనీయ భాగస్వామ్యం: మోడీ

శిఖిరాగ్ర సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుడూ భారత్‌ దృష్టిలో క్వాడ్‌ ఒక ‘నిర్మాణాత్మకమైన, విశ్వసనీయమైన భాగస్వామ్యం’ అని చెప్పారు. సముద్ర భద్రత నుంచి సరఫరా వ్యవస్థల విశ్వసనీయత వరకు, నూతన సాంకేతిక పరిజ్ఞానం నుంచి విపత్తుల నిర్వహణ వరకు ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి నమ్మదగిన పరిష్కారాలను అందించేందుకు క్వాడ్‌ కృషి చేస్తోందని తెలిపారు.

ఏఐ అభివృద్ధికి 85 మిలియన్‌ డాలర్లు : ట్రంప్‌

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో విశ్వసనీయమైన ఏఐ వ్యవస్థల అందుబాటును విస్తరించేందుకు 85 మిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ‘ కీలక సాంకేతిక పరిజ్ఞానాల భవిష్యత్తు మన విలువలను, ఉమ్మడి ప్రయోజనాలను మరింతగా పెంచుతుంది.’ అని అన్నారు. సరఫరా వ్యవస్థలకు భద్రత కల్పించేందుకు కీలక ఖనిజాలపై పలు ముఖ్యమైన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఏ ఒక్క విదేశీ సరఫరాదారుపైనా తమ దేశాలు ఆధారపడాల్సిన పరిస్థితి రాకుండా చూడటమే ఈ ఒప్పందాల లక్ష్యమని వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్