ఇండియా బ్లాక్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రతిపక్ష ఇండియా బ్లాక్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై సమగ్ర విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఇసిఐ) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలతోపాటు ఉన్నతాధికారులకు 48 ప్రశ్నలు (ఇంటరాగేటరీస్) సంధిస్తూ ప్రతిపక్ష నేతలు దరఖాస్తు చేశారు. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తెలిపింది. దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించడాన్ని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ను ఏకగ్రీవంగా నిర్ణయించిం దంటూ అక్టోబర్ 26న దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాల విశ్వసనీయతను వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమిషనర్లందరి ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్ప డానికి ఇసి ఎలాంటి ఆధారాలనూ సమర్పించ లేదని ఇండియా బ్లాక్ నాయకులు తెలిపారు.







కామెంట్‌లు (0)