- విలవిలలాడుతున్న కారంచేడు మండలం!
- రహదారులపై పొంగిపొర్లుతున్న వరద నీరు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- విద్యుత్, తాగునీటికి ప్రజల అవస్థలు.. నీట మునిగి కుళ్లిపోయిన వరి, మిర్చి పంటలు
ప్రజాశక్తి-కారంచేడు : మురసు తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా కారంచేడు మండలాన్ని వరద కష్టాలు వీడటం లేదు. తుఫాను తగ్గుముఖం పట్టి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ మండలంలోని పలు గ్రామాలు ఇంకా వరద నీటి ముంపులోనే చిక్కుకున్నాయి. గత సంవత్సరం ఏర్పడ్డ మొందా తుఫాను మాదిరిగానే ప్రస్తుతం కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పర్చూరు వాగు పొంగిపొర్లుతుండటంతో దాని అనుసంధానంగా ఉన్న కారంచేడు మండలంలోని పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాల్లోని పొలాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది.
చీకట్లోనే పలు గ్రామాలు.. తాగునీటికి క్యూలు!
కరెంటు స్తంభాలు విరిగిపడిపోవడం చెట్లు కూలిపోవడంతో మండలంలోని కొన్ని గ్రామాలకు నేటికీ విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాలేదు. మరోవైపు తాగునీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు మంచినీటి కోసం వాటర్ ప్లాంట్ల వద్ద బారులు తీరుతున్నారు. విద్యుత్, తాగునీటి సమస్యలతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ జనజీవనం ఇంకా గాడిన పడలేదు.
రైతులకు కోలుకోలేని దెబ్బ.. కుళ్లిపోయిన పంటలు!
మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి, మిర్చి పంటలు వరద నీటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు నీట మునిగి కుళ్లిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ నేను ప్రభావంతో నిన్న మొన్నటి దాకా సాగునీరు లేక అక్కడక్కడ ఉన్న కొద్దిపాటి నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వేసిన వరి ,మిర్చి పంటలు కళ్లముందే నీటిపాలవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు వాపోతున్నారు.
స్వర్ణలో రైస్ గోదాముపై తుఫాను పంజా.. 3 వేల బస్తాల ధాన్యం తడిసిముద్ద!
మండలంలోని స్వర్ణ గ్రామంలో వెంకయ్యకు చెందిన రైస్ గోదాముపై మురసు తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. తుఫాను గాలులకు గోదాము పైకప్పులు ఎగిరిపోవడంతో లోపల నిల్వ ఉంచిన రైతుల ధాన్యం వర్షపు నీటికి తడిసిపోయింది. సుమారు 3 వేల బస్తాల వరి ధాన్యం తడిసినట్లు, వీటి విలువ దాదాపు రూ.12 లక్షలు ఉంటుందని గోదాము నిర్వాహకులు తిరుమలశెట్టి చిట్టిబాబు ప్రజాశక్తికి తెలిపారు. రైతులకు చెందిన ధాన్యం దెబ్బతినడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.
లోతట్టు వంతెనలు మునక.. గ్రామాలకు రాకపోకలు బంద్!
చీరాల నుంచి స్వర్ణ, రంగప్పనాయుడువారిపాలెం, కేశవరప్పాడు, కొడవలివారిపాలెం గ్రామాలకు దండుబాట మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న లోతట్టు వంతెనలు వరద నీటితో నిండిపోయాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు తీవ్రంగా అంతరాయానికి గురయ్యాయి. వాహనదారులు, ప్రయాణికులు ఈ మార్గంలో వెళ్లలేక కారంచేడు మీదుగా చుట్టూ తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అధికారులు స్పందించాలి
వరద ముంపు నుంచి గ్రామాలను బయటపడేసేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని, రహదారులపై వరద నీటిని తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించి రైతులకు పరిహారం అందించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.







కామెంట్లు (0)