శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దోపిడీకి వ్యతిరేకంగా పెరుగుతున్న ఉద్యమాలు..

6 రోజుల క్రితం

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 06:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- బ్రహ్మయ్య సంతాప సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -కొండపి (ప్రకాశం జిల్లా): కమ్యూనిజానికి కాలం చెల్లిందని, ఎర్రజెండా ఇంకెక్కడుందని, ప్రగల్భాలు పలుకుతున్న వారికి సరైన సమాధానం చెప్పేలా నేటి ప్రపంచ పరిణామాలు ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సీనియర్ నేత, వ్యవసాయ కార్మిక పోరాటాల యోధుడు అంగలకుర్తి బ్రహ్మయ్య శుక్రవారం మృతి చెందగా శనివారం పెరిదేపిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు అధ్యక్షత వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆనాడు గ్రామాల్లో ఉన్న అంటరానితనం, అవమానాలను ప్రత్యక్షంగా అనుభవించిన బ్రహ్మయ్య.. ఆ దురవస్థ నుంచి బయటపడాలంటే కమ్యూనిస్టుల మార్గమే సరైనదని నమ్మి కడవరకూ కమ్యూనిస్టుగా నిలబడ్డారని కొనియాడారు. 1974లో కష్టజీవుల రాజ్యం సాధన కోసం ఎర్రజెండా పట్టిన బ్రహ్మయ్య తన కుటుంబ సభ్యులను, బంధుమిత్రులందరినీ మార్క్సిస్ట్ వైపు నిలబెట్టారని గుర్తు చేశారు. బ్రహ్మయ్య తన పోరాటాలు, ఆచరణ ద్వారా ఆదర్శ కమ్యూనిస్టుగా నిలబడ్డారని, ఆయన ఆశయాల సాధనకు అంకితమవుదామని అన్నారు. న్యూయార్క్ లో సోషలిస్టు పార్టీ అభ్యర్థులు గెలుపొందుతున్నారని, అనేక యూరోపియన్ దేశాలలో కమ్యూనిస్టు భావజాలం కలిగిన వారు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.

సిపిఎం సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య, జాల అంజయ్య, పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ.. పెరిదేపి పల్లెను ఐక్యంగా నిలబెట్టడంలో బ్రహ్మయ్య క్రియాశీలకమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. మూసి ఏరు ఒడ్డున ఉన్న మాదిగ పల్లెను ఊరికి దక్షణానికి తెచ్చేటువంటి క్రమంలో జరిగిన ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారని తెలిపారు. పొగాకు ముఠా కార్మికుల కూలి రేట్ల విషయంలో నికరంగా నిలబడి కష్టజీవులకు న్యాయం జరిగేలా కృషి చేశారని కొనియాడారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్ కే మాబూ, రాష్ట్ర కమిటీ సభ్యులు జీవి కొండారెడ్డి, అండ్రమాల్యాద్రి మాట్లాడుతూ... బ్రహ్మయ్య ప్రజా పోరాటాల నాయకుడే కాదు గొప్ప కళాకారుడని గుర్తు చేశారు. బ్రహ్మయ్య మార్గదర్శకత్వంలో తయారైన పెరిదేపి డప్పు దళం, కోలాట దళానికి నేటికీ ప్రత్యేకత గుర్తింపు ఉందన్నారు. ఈ సంతాప సభలో సిపిఎం నాయకులు గంటీనపల్లి వెంకటేశ్వర్లు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, పార్టీ నాయకులు పమిడి వెంకట్రావు, జి శ్రీనివాసులు, చీకటి శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. అంతిమయాత్రలో పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్