- కర్నూలు కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీల ఆందోళన
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్ : తమపై అదనపు పని భారాన్ని మోపడం వెంటనే నిలిపివేయాలని, రోజుకు ఎనిమిది ఫొటోలు అప్‌లోడ్ చేయాలనే నిబంధనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. సిఐటియు, ఎఐటియుసి నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. అంజిబాబు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్కీ లెనిన్‌బాబు, శ్రామిక మహిళ సంఘం జిల్లా కన్వీనర్ పి. నిర్మల, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటమ్మ మాట్లాడారు. రోజురోజుకూ అంగన్‌వాడీ కార్యకర్తలపై అదనపు పనిభారం మోపుతున్నారని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకూ ఎనిమిది ఫొటోలు అప్‌లోడ్ చేయాలనే నిబంధన విధించడం సరికాదన్నారు. వెంటనే నిబంధనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలకు సామాజిక పింఛన్ల విషయంలో ఉన్న వివక్షను తొలగించి, గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన వారికి కూడా పింఛన్లు అందించాలని కోరారు. అంగన్‌వాడీల సమస్యలపై జిల్లా అధికారులు స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఐసిడిఎస్ పిడి విజయకు వినతిపత్రం అందజేశారు. సిఐటియు, ఎఐటియుసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)