- సిఎ చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బాలల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా విద్య, విజ్ఞానం, ఆధునిక సాంకేతికతతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను అందించే విద్యావిధానానికి ఎన్ డిఎ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాలల అభ్యున్నతితోనే రాష్ట్ర, దేశ ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకుశనివారం ఎక్స్ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి యువత, దేశ భవిత అని పేర్కొన్నారు. కలలను సాకారం చేసి, ప్రతిభను వెలికితీసి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా తీర్చిదిద్దడం మనందరి బాధ్యతని తెలిపారు. ప్రతి చిన్నారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ఎక్స్ వేదిక ద్వారా శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి బాలుడిలోనూ అపారమైన ప్రతిభ, అంతులేని ఊహాశక్తి, మెరుగైన భవిష్యత్తును నిర్మించే సామర్థ్యం దాగి ఉన్నాయని పేర్కొన్నారు. చిన్నారుల పరిస్థితులు వారి ఆశయాలకు అడ్డంకిగా మారకూడదని, విద్యకు ప్రాధాన్యతనిస్తూ హక్కులను కాపాడాలని, ప్రతిభను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రతి చిన్నారికి ఎదిగే అవకాశం కల్పించినప్పుడే దేశ భవిష్యత్తు బలపడుతుందని, పిల్లల కలలకు రెక్కలు తొడిగి మెరుగైన రేపటిని నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు.








కామెంట్లు (0)