- ‘భారతీయం’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్
ప్రజాశక్తి–కాకినాడ రూరల్ : పాఠశాలల్లో రాజకీయాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, షూస్ వంటి వాటిలో రాజకీయ పార్టీల రంగులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ప్రవచనకర్త, ఎపి ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమానికి లోకేష్ హాజరై ప్రసంగించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఇంటర్మీడియట్‌లోనూ పది వేల అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ మార్పు సాధ్యమైందన్నారు. విద్యతో పాటు నైతిక విలువలను అందిస్తే ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నైతిక విలువలు భారతీయ సమాజానికి, కుటుంబ వ్యవస్థకు పునాది వంటివన్నారు. చిన్న వయస్సు నుంచే పిల్లలకు చదువు, క్రీడలతో పాటు నైతిక విలువలు నేర్పించాలని సూచించారు. పెద్దలను, మహిళలను గౌరవించడం, గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించడం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. . ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం విద్యార్థి కేంద్రంగా ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా గత రెండేళ్లలో అనేక సంస్కరణలు చేపట్టామని వివరించారు.
సిఐటియు నేత రాజా అరెస్టు
లోకేష్ పర్యటన నేపథ్యంలో సిఐటియు కాకినాడ రూరల్ కార్యదర్శి తొట్టిపూడి రాజాను సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం నేతను పరామర్శించేందుకు వెళ్లిన రాజాను పోలీసులు అక్కడ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సాయంకాలం ఏడు గంటల తర్వాత విడుదల చేశారు.








కామెంట్‌లు (0)