మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను హైజాక్ చేశారని, నామినేషన్ల నుండి ఫలితాల ప్రకటన వరకూ మొత్తం రిగ్గింగ్ చేశారని మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విమర్శించారు. గురువారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రిగ్గింగ్‌కు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి, డిజిపి, డిఐజి, ఎస్‌పి, డిఎస్‌పి నుండి ఆర్‌ఓ వరకూ మాఫియాలా తయారై ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని ఆపహస్యం చేశారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జరిగిన దాడులను దేశం మొత్తం చూసిందని, దక్షిణ బీహార్‌లా రాష్ట్రం మారిందన్నారు. ప్రస్తుతం జరిగినవి ఎలక్షన్స్ కాదని సెలక్షన్స్ అని వ్యాఖ్యానించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఈ ఎన్నికల్లో ఆ సూత్రాన్నే పూర్తిగా హైజాక్ చేశారని అన్నారు. అధికార దుర్వినియోగం, రౌడీయిజంతో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రిగ్ చేశారని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, 143 హామీలతో ఇంటింటికీ వెళ్లి బాండ్లు ఇచ్చిన సిఎం వాటిని అమలు చేయకపోవడంతో ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక ఎన్నికలనే హైజాక్ చేశారన్నారు. టిడిపి గూండాలతో పోలీసులు కుమ్మక్కై వైసిపి అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపాలిటీల్లో వైసిపి ఛైర్‌పర్సన్ అభ్యర్థులను నామినేషన్ వేయనీయలేదని, మరో 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ దశలోనే పోటీ లేకుండా చేశారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంస్కరణలు ఎంత అవసరమో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిస్థితులు దేశానికి ఒక కేస్ స్టడీగా నిలుస్తాయని చెప్పారు. నామినేషన్లు, స్క్రూటినీ, పోలింగ్ బూత్‌లు, పోలింగ్ శాతం, రాత్రిపూట బ్యాలెట్ బాక్సుల రిగ్గింగ్ వరకు ఎన్నికల ప్రక్రియ మొత్తం కబ్జా చేశారని తెలిపారు. విశాఖలో గొడవ చేసి అడిగిన తర్వాతే స్ట్రాంగ్ రూములకు సీల్ వేశారని పేర్కొన్నారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారని, పలుచోట్ల స్లిప్పులు తీసుకుని ఓటర్లను బయటకు పంపించేశారని విమర్శించారు. వీటిని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా దాడులు చేశారని అన్నారు.
ప్రజల ఆస్తులను అమ్ముతున్నారు.
మహిళలకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సింది పోయి అమ్మకానికి పెడుతున్నారని, పోర్టులు, హార్బర్లు కూడా స్కాములతో అమ్మకానికి సిద్ధం చేస్తున్నారని తెలిపారు. “ప్రభుత్వ భూములను కావాల్సిన వారికి పావలాకు రూపాయికి కట్టబెడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్ అన్న పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను చంద్రబాబు తన స్వార్థం కోసం దిగజార్చారని అన్నారు. జెన్‌జీ ప్రజాస్వామ్య హక్కుల కోసం గొంతెత్తుతున్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రిగ్గింగ్ ఎలా చేయాలి, సైక్లింగ్ ఎలా చేయాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా కూనీ చేయాలి అనే ట్యూషన్లు పెట్టి నేర్పిస్తున్న పరిస్థితి వచ్చిందని తెలిపారు.
తుఫాను సాయం అందడం లేదు
రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. పది రోజులు గడిచినా 150 గ్రామాలకు కరెంటు అందని పరిస్థితి ఉందని అన్నారు. మురుసు తుఫాన్‌లో ఇద్దరు చనిపోయారని , తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు, ప్రజలకు దమ్మిడీ సహాయం అందలేదని తెలిపారు. గత ఏడాది మోంతా తుఫాన్ నష్టాలకు ఇప్పటికీ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)