విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా చోరీలు.
ప్రభుత్వానికి 65 లక్షల మేర నష్టం.
వరుస చోరీలతో ప్రజలు బెంబేలు !
ప్రజాశక్తి - రాజుపాలెం : ఆరుగాలం శ్రమించే అన్నదాతకి అష్ట కష్టాలు తప్పడం లేదు. ఎలినినో ప్రభావంతో ఖరీఫ్ ప్రమాదంలో పడింది. జాడ లేని వర్షాలు, మండుతున్న ఎండలతో ఎండుతున్న చెరువులకు తోడు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చుక్క నీరు కోసం అన్నదాత ఆకాశం వైపు ఆశగా చూసే దారుణ పరిస్థితిలు నెలకొన్నాయి. ఇప్పటికే వేసిన పంటలను కాపాడుకొనేందుకు రైతులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల పై ఆధారపడి పంటలను సాగుచేస్తున్నారు. మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్లు ఎల్ నీఓ కి తోడు దొంగలతో అన్నదాతలకు ఇంటా , బయటా కంటిమీద కునుకు లేకుండా పోతుంది. మండల పరిధిలో వరుసగా జరుగుతున్న దొంగతనలతో ప్రజలు ,విద్యుత్ కార్యాలయానికి ,పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు.మండల పరిధిలో 32 పైబడి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల , పలు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. రోజు గడిస్తే ఏ ఊరులో ఏ దొంగతనం జరిగిందో అని చెప్పుకోవాల్సిన దుస్థితి నెలకొందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి.. దళారుల దగాకి కృగిపోని రైతన్నకి నేడు కంటి మీద కునుకు లేకుండా పోతుంది.మండలంలోని పలు గ్రామాల్లోనీ పొలాల్లో జరిగిన ట్రాన్స్ ఫార్మర్ల దొంగతనాల తీరుపై రైతన్నలు ఇంటి దొంగల హస్తం ఉంటుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో గురజాల నియోజకవర్గంలో జరిగిన ట్రాన్స్ ఫార్మర్ల దొంగతనాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది పాత్ర ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వానికి 65 లక్షల వరకు నష్టం జరిగిందని , బృందాలుగా విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రి వేళల్లో తిరుగుతున్నారని ,ఉన్న ట్రాన్స్ ఫార్మర్ల కు గట్టి భద్రత పెంచినట్లు రాజుపాలెం ఏ ఈ తెలిపారు. అలాగే పోలీసులు యూనిఫాం,సివిల్ లో గస్తీ కాస్తున్నారని , ఎవరైనా అనుమానంగా సంచరిస్తున్నా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాజుపాలెం పోలీస్ స్టేషన్ ఇంచార్జీ ఎస్ ఐ తెలిపారు.








కామెంట్లు (0)