శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్వాసితులకు రూ.250 కోట్ల 
పరిహారం అందజేత

5 గంటల క్రితం

cbn.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 31న వెలిగొండ ద్వారా నీళ్లు

​​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి ఈ నెల 31న నీళ్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో వెలిగొండ నిర్వాసితులకు మూడో విడతలో రూ.250 కోట్ల పరిహారం చెక్కును ఆయన శనివారం అందజేశారు. దీంతో ఇప్పటి వరకూ 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఈ సందర్భంగా వెలిగొండ నిర్వాసితులతో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇబ్బందులున్నా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరివ్వాలని సంకల్పించుకున్నామని చెప్పారు. పోలవరం పూర్తి చేసి కృష్ణా డెల్టాకు, శ్రీశైలంలో నీరు పొదుపు చేసి ప్రకాశం, నెల్లూరు, కడప, రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వొచ్చని, గంగా-గోదావరి-కావేరిని అనుసంధానించాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలిపారు. ఐదు నదులను అనుసంధానిస్తే నాలుగు రాష్ట్రాల్లో సమస్యలు తీరిపోతాయని, దేశానికే నీటి సమస్య పరిష్కారమై, నీటి భద్రత వస్తుందని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు జరిగేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మార్కాపురం జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి నీరిస్తామని, సెప్టెంబరులోనే హార్టికల్చర్ హబ్‌కు ఫౌండేషన్ వేస్తామని చెప్పారు. అభివృద్ధితో పాటు ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాల్సి ఉందని, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయని, మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్‌‌ఛార్జి ఎరిక్సన్ బాబు, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ప్రశాంతి, వెలిగొండ నిర్వాసితులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్