- కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
- విశాఖలో బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశం ప్రారంభం
- యువత సహకారంపై ఉమ్మడి ప్రకటన ఆమోదం
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ : యువత భాగస్వామ్యంతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. విశాఖపట్నంలో రెండు రోజులపాటు జరిగే బ్రిక్స్ యువజన, క్రీడా మంత్రుల సమావేశం శనివారం ప్రారంభమైంది. మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి సునీల్ పాలీవాల్‌తో పాటు బ్రిక్స్ సభ్య దేశాల యువజన శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన బ్రిక్స్ యువజన సదస్సు, బ్రిక్స్ యువజన మండలి సమావేశాల్లో వచ్చిన సూచనలు, సిఫార్సుల ఆధారంగా విశాఖలో మంత్రుల స్థాయి చర్చలు జరిగాయి. యువతకు సంబంధించిన విధానాలు, వారి భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, పారిశ్రామికత, సాంకేతికత, సామాజిక సేవ వంటి అంశాలపై ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో యువత కీలక భాగస్వాములుగా ఉండాలన్నారు. బ్రిక్స్ దేశాల యువత పరస్పర సహకారంతో ఉమ్మడి భవిష్యత్తును నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మొక్కలు నాటి మాతృమూర్తుల పట్ల కృతజ్ఞత
ఈ సమావేశంలో బ్రిక్స్ యువజన మంత్రుల ఉమ్మడి ప్రకటనను ఆమోదించారు. విద్య, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, యువ పారిశ్రామికత, సైన్స్-టెక్నాలజీ-ఇన్నోవేషన్, సామాజిక-సాంస్కృతిక భాగస్వామ్యం, స్వచ్ఛంద సేవ, పేదరికం-ఆకలి-అసమానతల నిర్మూలన, ఆరోగ్యం, యువత-క్రీడలు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత, మతాంతర యువజన సంభాషణ, యువత మార్పిడి కార్యక్రమాలు, సమగ్ర యువజన భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రకటనలో ప్రాధాన్యం ఇచ్చారు. సమావేశం సందర్భంగా బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ప్రతినిధి తన తల్లి గౌరవార్థం మొక్కను నాటడం ద్వారా మాతృమూర్తుల పట్ల కృతజ్ఞతను చాటారు.
తొట్లకొండ బౌద్ధ ఆరామం సందర్శన
విశాఖ సమీపంలోని చారిత్రక తొట్లకొండ బౌద్ధ ఆరామాన్ని ప్రతినిధులు సందర్శించారు. భారతదేశ ప్రాచీన నాగరికత, బౌద్ధ వారసత్వం, శాంతి, సామరస్యం, సాంస్కృతిక మార్పిడికి సంబంధించిన అంశాలను వారు తెలుసుకున్నారు.
ద్వైపాక్షిక సమావేశాలు
డాక్టర్ మాండవీయ దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన తన సమాన హోదా ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యువజన వ్యవహారాలు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, యువ పారిశ్రామికత, డిజిటల్ వేదికల ద్వారా యువత భాగస్వామ్యం వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశాలపై చర్చించారు.
విశాఖను అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం : చంద్రబాబు
విశాఖలోని నోవాటెల్ వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల యువజన, క్రీడల శాఖల మంత్రుల సాంస్కృతిక కార్యక్రమం-2026కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖను మారిటైమ్ గేట్‌వేగా, టెక్నాలజీ–ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. విశాఖ కేంద్రంగా ‘బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్’ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆయన ముందుకు తెచ్చారు. ఈ నెట్‌వర్క్ ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య అథ్లెట్లు, కోచ్‌ల పరస్పర మార్పిడి, శిక్షణ కార్యక్రమాలు, వాటర్ స్పోర్ట్స్ పోటీలు, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు నిర్వహించేందుకు అవకాశాలు ఏర్పడతాయని సిఎం తెలిపారు. స్పోర్ట్స్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్ల రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిక్స్ దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు.
క్రీడాభివృద్ధికి భారత్ - చైనా పరస్పర సహకారం : కుయ్ జియాన్
బ్రిక్స్ సమావేశాల నిమిత్తం విచ్చేసిన చైనాకు చెందిన ఉన్నత స్థాయి క్రీడా ప్రతినిధి బృందం ఎంవిపి.కాలనీలోని జివిఎంసి స్పోర్ట్స్ ఎరీనాను సందర్శించింది. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ వైస్ మినిస్టర్ కుయ్ జియాన్ నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందానికి జివిఎంసి అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య స్వాగతం పలికారు. కుయ్ జియాన్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి ఇండియా-చైనా పరస్పర సహకారం అందించుకుంటాయని తెలిపారు. క్రీడలంటే ప్రత్యర్థిని ఓడించడం మాత్రమే కాదని, తనను తాను అధిగమిస్తూ నిరంతరం మెరుగుపరుచుకోవడం, అపజయాల నుంచి తిరిగి నిలబడే ధైర్యాన్ని పెంపొందించుకోవడం క్రీడా స్ఫూర్తిలో భాగమని యువ క్రీడాకారులకు సందేశమిచ్చారు. క్రీడల అభివృద్ధిలో భారత్–చైనా మధ్య సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. స్నేహం, సాంస్కృతిక మార్పిడికి గుర్తుగా చైనా ప్రతినిధి బృందం ‘రెడ్ హార్స్’ చిత్రంతో కూడిన జ్ఞాపికను అందజేసింది.







కామెంట్‌లు (0)