గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమూడో విడత పంచాయతీ ఎన్నికల నగారా

1 గంట క్రితం

4,240 సర్పంచ్, 42,626 వార్డు స్థానాలకు ఎన్నికలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 12:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 4,240 సర్పంచ్, 42,626 వార్డు స్థానాలకు ఎన్నికలు

  • డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్

  • ఎస్ఇసి అనిల్ చంద్ర పునేఠా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 4,240 సర్పంచ్‌లు, 42,626 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం మన్యం, తిరుపతి జిల్లాల్లో ఈ విడతలో ఎన్నికలు జరగడం లేదు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికలు అవసరమైన గ్రామ పంచాయతీల్లో డిసెంబర్ 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ విడతలో రాష్ట్రంలోని 25 జిల్లాల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న ఉదయం 10 .30 గంటల నుండి నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 23న సాయంత్రం 5 గంటల వరకు దాఖలుకు అవకాశం ఉంటుంది. 24న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపడతారు. 25న తిరస్కరణపై అప్పీళ్ల స్వీకరణ, 26న పరిష్కారం ఉంటుంది. 27న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు విధించారు. అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడైన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. అనివార్య కారణాలతో ఆరోజు సాధ్యం కాకపోతే మరుసటి రోజు చేపడతారు. రీపోలింగ్ అవసరమైన చోట్ల డిసెంబర్ 3న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆయా పంచాయతీల్లో ఉపసర్పంచ్ ఎన్నికను రీపోలింగ్ ఫలితాల అనంతరం నిర్వహిస్తారు.

59 పదవులకు నేడు ఎన్నికలు

రాష్ర్టంలో పెండింగ్‌లో ఉన్న 34 ఎంపిపి, 59 వైస్‌ ఎంపిపి పదవులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 మండల ప్రజా పరిషత్‌లకు గాను ఇప్పటివరకు 625 ఎంపిపి, 600 వైస్‌ ఎంపిపి పదవులకు ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన 34 ఎంపిపి, 59 వైస్‌ ఎంపిపి పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని వివరించారు. ఈ ఎన్నికల కోసం సంబంధిత మండలాల్లో ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్