ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఘటన.. ప్రత్యేక బృందాలతో గాలింపు
ప్రజాశక్తి - ఒంగోలు సిటీ : పోలీసుల కస్టడీలో ఉన్న ముగ్గురు అండర్ ట్రయల్ ఖైదీలు పరారైన ఘటన ఒంగోలు రైల్వే స్టేషన్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. చీరాల కోర్టులో విచారణకు హాజరుపరిచి, తిరిగి ఒంగోలు జిల్లా జైలుకు తీసుకువస్తుండగా రైల్వే స్టేషన్‌లోని ఐదో ప్లాట్‌ఫారంపై పోలీసుల కళ్లుగప్పి ముగ్గురూ పరారయ్యారు. పోలీసు సిబ్బంది ఎస్కార్ట్‌గా ఉన్నప్పటికీ ఖైదీలు తప్పించుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంతోష్ బూరియా, భూరు మాక్స్వానా అలియాస్ భూరు సాధన్ బిల్ , రమేష్ మర్చార్ అలియాస్ రేమో అనే ముగ్గురు అండర్ ట్రయల్ ఖైదీలు పరారయ్యారు. వీరిని బాపట్ల జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులకు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక పోలీసు కానిస్టేబుల్ ఎస్కార్ట్‌గా తీసుకువెళుతున్నారు. చీరాల అసిస్టెంట్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణకు హాజరుపరిచిన అనంతరం తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్ (17291) రైలులో ఒంగోలుకు తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనపై ఒంగోలు ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 125/2026, బీఎన్‌ఎస్ సెక్షన్ 262 కింద కేసు నమోదు చేశారు. పరారైన ఖైదీల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఒంగోలు జీఆర్పీ ఎస్‌ఐ టి. శ్రీరామ్ తెలిపారు.
పోలీసుల ఎస్కార్ట్‌లోనే ముగ్గురు ఖైదీలు పరారవడం భద్రతా ఏర్పాట్లు, విధి నిర్వహణ తీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.








కామెంట్‌లు (0)