పరిషత్ ఎన్నికల బందోబస్తుకు 40,679 మంది
డిజిపి హరీష్ కుమార్ గుప్తా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5న జరగనున్న ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. 28 జిల్లాల పరిధిలో 582 జెడ్‌పిటిసి, 7,778 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 17,555 పోలింగ్ ప్రాంతాలు, 31,472 పోలింగ్ కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల కోసం వివిధ హోదాలకు చెందిన 38,348 మంది పోలీసులతోపాటు 111 ఎపిఎస్‌పి ప్లటూన్లు, కమ్యూనికేషన్ విభాగానికి చెందిన 335 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. అత్యంత సమస్యాత్మకమైన 1,841, సమస్యాత్మకమైన 2,645 పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రత కల్పించామని పేర్కొన్నారు. భద్రతలో భాగంగా 3,488 రూట్ మొబైల్స్, 931 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 412 చెక్‌పోస్టులు, 847 ఎస్‌ఎస్‌టి బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 547 పంపిణీ కేంద్రాల వద్ద 1,381 మంది సిబ్బందిని నియమించామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)