శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

భారీగా పడిపోయిన టమోటా ధర

03 జులై, 2026

tomato
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 12:12 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రూ.300న పలికిన 
బాక్స్‌ ధర రూ.60కి పతనం

- అన్నదాతల ఆగ్రహం

- మార్కెట్‌ యార్డ్‌ వద్ద రాస్తారోకో

ప్రజాశక్తి - పలమనేరు: టమోటా రైతన్నకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నిన్నమొన్నటి వరకు మంచి ధర పలికిన టమోటా ఒక్కసారిగా భారీగా పతనమైంది. సరుకు ఎక్కువ రావడం వల్లే ధర తగ్గిందంటూ అధికారులు సాకులు చెప్పడంతో అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు వ్యవసాయ మార్కెట్లో ఇటీవల వరకూ 15 కిలోల బాక్స్ ధర రూ.300 వరకూ పలికింది. శుక్రవారం కూడా రైతులు టమోటాను యథావిధిగా తీసుకొచ్చారు. అయితే శుక్రవారం ఒక్కసారి బాక్స్‌ ‌ధర రూ.60 కి పడిపోయింది. గరిష్టంగా రూ.100 మించలేదు. ధర భారీగా పతనం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూకుమ్మడిగా రైతులంతా రోడ్డుపైకి చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. వ్యాపారులు, దళారులు, అధికారులు కుమ్మక్కు కావడం వల్లే ధర ఇంతగా పతనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. టమోటాకు గిట్టుబాటు ధర కల్పించాలని నినదించారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్ వద్ద రోడ్డుపై మండుటెండలో రాస్తారోకో కొనసాగించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ రాజన్న తీరుపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఒక్కసారి కూడా మార్కెట్ యార్డుకు వచ్చి రైతుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహించారు. మార్కెట్ ఛైర్మన్‌‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర పతనం కావడంతో రవాణా ఖర్చులు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు రాకున్నా మార్కెట్ కమిటీ ప్రేక్షకపాత్ర పోషిస్తోందని వాపోయారు. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ సంజీవ్ కుమార్ రైతులతో చర్చించారు. పలమనేరు మార్కెట్‌ ‌కు ప్రతిరోజూ 500 నుంచి 800 టన్నుల టమోటా వస్తోందని, శుక్రవారం గరిష్టంగా దాదాపు 925 టన్నులు వచ్చిందని తెలిపారు. సరుకు ఎక్కువగా రావడంతో ధర తగ్గిందంటూ సాకులు చెప్పారు. చుట్టుపక్కల పుంగనూరు, వి.కోట మార్కెట్ యార్డుల్లో గరిష్ట ధర రూ.180 పలికిందని తెలిపారు. దీనిపైనా రైతన్నలు నిలదీశారు. దీంతో గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్