- సముద్రంలో మునిగి ముగ్గురు మృతి
ప్రజాశక్తి - అమలాపురం : సముద్రంలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు మృతి చెందిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఓడలరేవు సముద్ర తీరానికి అంబాజీపేట మండలం మాచవరం, కాట్రేనికోనకు చెందిన తొమ్మిది మంది యువకులు ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. వీరంతా సముద్రంలో స్నానాలకు దిగగా, వారిలో ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికులు, మెరైన్ పోలీసులు గాలించి మంచాల శ్రీరామ్ (17) మంచాల సాయి (22) కాట్రేనికోన మండలం చెయ్యేరునికి చెందిన సూదా అరవింద్ (23) మృతదేహాలను వెలికి తీశారు. వీరంతా హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ స్వగ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి అవసరమైన ప్రభుత్వ సాయం అందించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని బీచ్‌ల వద్దా ప్రమాదకర ప్రాంతాలను స్పష్టంగా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.








కామెంట్‌లు (0)