- నలుగురు విద్యార్థులు మృతి
- ఒకరికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి - టెక్కలి, రూరల్ : భారీ వర్షాల నేపథ్యంలో కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో నలుగురు విద్యార్థులు కలిసి రైలు పట్టాలపై కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయితే తమ వెనుక వస్తున్న మృత్యువును వారు గమనించలేకపోయారు. క్షణాల వ్యవధిలోనే రైలు ఢీకొట్టడంతో నలుగురూ అక్కడికక్కడే మరణించారు. రైలు ఢీకొట్టిన తీవ్రతకు మృతుల శరీర భాగాలు పట్టాల వెంట చెల్లాచెదురుగా పడిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదం నేపథ్యంలో రైలును గంటపాటు నిలిపివేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం దమర గ్రామానికి చెందిన జన్ని దిలీప్ కుమార్ (17), గంగువాడ విశాఖరావు(17), చిన్న భీంపురం గ్రామానికి చెందిన జన్ని శరత్ కుమార్ (17), మెళియాపుట్టి మండల కేంద్రానికి చెందిన సవర శివ(17) నలుగురూ టెక్కలిలోని ఎస్‌టి వసతిగృహంలో ఉంటూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. భారీ వర్షాల కారణంగా కళాశాలకు సెలవు రావడంతో, విశాఖరావు సోదరుడు సాల్మన్ రాజుతో కలిసి టెక్కలి నుంచి నౌపడ వైపు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నారు. భువనేశ్వర్ నుంచి గుణుపూర్ వెళ్తున్న రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రావివలస కూడలి సమీపంలో వీరిని ఢీకొట్టడంతో నలుగురూ అక్కడికక్కడే మరణించారు. గాయపడిన సాల్మన్‌రాజ్‌ను శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. ఈ ఘటనతో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ను గంటన్నర పాటు టెక్కలిలో నిలిపివేశారు.
సిఎం తీవ్ర దిగ్భ్రాంతి
రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డసాల్మన్‌రాజుకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం సూచించారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే జిల్లా రెవెన్యూ, పోలీసు, రైల్వే ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.











కామెంట్‌లు (0)