- సత్యసాయి ట్రస్ట్ సభ్యులు డాక్టర్ వి.మోహన్
ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్ : సత్యసాయి సంస్థలకు సేవాదళ్ వెన్నెముక లాంటిదని ఎలాంటి ఆశ, ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా నిజమైన సేవలందించే స్వచ్ఛంద సైన్యమే సేవాదళ్ అని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ వి.మోహన్ పేర్కొన్నారు. సత్యసాయి జయంతి ఉత్సవాలలో భాగంగా పుట్టపర్తిలో పదవ అఖిలభారత సేవాదళ్ రెండో రోజు జరిగిన ముగింపు సదస్సులో ఆయన మాట్లాడారు. కేవలం పరిస్థితులకు స్పందించే వారిగా కాకుండా, ముందుగానే సేవా అవకాశాలను గుర్తించి చొరవతో ముందుకు సాగాలని, ఎక్కడ ఉన్నా సేవ చేసే అవకాశాలను గుర్తించాలని సేవాదళ్ సేవకులకు పిలుపునిచ్చారు. జాతీయ మహిళా సేవాదళ్ సమన్వయకర్త డాక్టర్ ఎల్ శశిబాల మాట్లాడుతూ... సేవాదళ్ యూనిఫారం బ్యాడ్జి మాత్రమే కాదని, ఒక వ్యక్తిని నిజమైన సేవాదళ్గా గుర్తించేదని అన్నారు.
22న పుట్టపర్తికి రానున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్...
సత్య సాయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఈనెల 22న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పుట్టపర్తికి రానున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. గవర్నర్ 22న ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయంలోని శ్రీనివాస గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. 11 గంటలకు అక్కడ నుంచి పూర్ణచంద్ర ఆడిటోరియం లోజరిగే సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలు పంపిణీ చేసి స్నాతకోపన్యాసం చేస్తారు. అనంతరం 12-30 గంటలకు సత్యసాయి విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి వెళ్తారు.









కామెంట్లు (0)