మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు – టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి
ప్రజాశక్తి : తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్‌ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి బుధవారం ప్రజలకు సూచించారు. సోషల్ మీడియా వేదికలలో, అనధికారిక వెబ్‌సైట్లలో, మధ్యవర్తుల ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన భక్తులకు సూచించారు. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ వెబ్‌సైట్లు, అక్రమ మార్గాల ద్వారా డబ్బులు వసూలు చేసే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, అలాంటి వారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. శ్రీవారి దర్శనం, వసతి, సేవల బుకింగ్‌లు, టికెట్ల విడుదల, రద్దు అయిన టికెట్ల లభ్యత, వివిధ దర్శనాల సమాచారం, వేచి ఉండే సమయం వంటి అన్ని వివరాలను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అలాగే ఎస్‌వీబీసీ ద్వారా కూడా భక్తులకు నిరంతరం అధికారిక సమాచారాన్ని చేరవేస్తున్నామని చెప్పారు. టికెట్లకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే టీటీడీ కాల్ సెంటర్ నెం: 155257 సంప్రదించాలని, అక్కడ అధికారికంగా పూర్తి సమాచారం, స్పష్టత అందిస్తారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యవర్తులకు లేదా అనధికారిక వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయవద్దని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని భక్తులకు ఆయన సూచించారు. ఎవరైనా మధ్యవర్తులు, దళారులు లేదా అనధికారిక వ్యక్తులు బుకింగ్‌ల పేరుతో సంప్రదించినట్లయితే వెంటనే టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు విభాగం ఫోన్ నెం: 9866898630 సమాచారం అందించాలని కోరారు. అటువంటి వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శ్రీవారి సేవలో పారదర్శకత, భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అధికారిక మార్గాల ద్వారానే సేవలను పొందాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి భక్తులకు పునరుద్ఘాటించారు.
బుధవారం టోకెన్ల నిలిపివేత
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నేడు తిరుపతిలోని భూదేవి, విష్ణునివాసం, శ్రీనివాసం మూడు ప్రాంతాల్లో శ్రీవారి సర్వదర్శన టోకెన్లను నిలిపివేశారు. మంగళవారం 8000 టోకెన్లు ఇవ్వగా వారికి బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు మరో రెండు వేల టోకెన్లను అదనంగా జారీ చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం యధావిధిగా టోకెన్లు జారీ చేస్తామని టిటిడి తెలిపింది. గడచిన మూడు వారాలగా ప్రతి బుధవారం టిటిడి టోకన్లను రద్దు చేస్తోంది. అయితే ఈ అంశాన్ని పున: పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.








కామెంట్‌లు (0)