వామపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు.. తోపులాట
'ప్రజల భూములు లాక్కోవడమే అభివృద్ధా?' అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై విమర్శలు
ప్రజాశక్తి - పలాస: ఉద్దానం ప్రాంతంలో ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్టును వ్యతిరేకిస్తూ చేపట్టిన 'చలో ఆర్‌డీఓ' కార్యక్రమంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను ఆర్‌డీఓ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వామపక్ష నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి వినతిపత్రాన్ని సమర్పించారు. కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని, ఉద్దానం ప్రకృతి సంపదను, ఉద్యానవనాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసులు మంగళవారం రాత్రి నుంచే చర్యలు చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఎంఎల్ (న్యూ డెమోక్రసీ) జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సిపిఐ (లిబరేషన్) నాయకుడు మద్దిలి రామారావు తదితరుల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించి హౌస్ అరెస్టులకు యత్నించారు. రైతులు, ప్రజలు ఆందోళనకు రాకుండా పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు.
పోలీసులను మోహరించినప్పటికీ.. ఒడిమి, రాంపురం, బేతాళపురం, గంగువాడ, ఒంకులూరు తదితర 18 గ్రామాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించి, ప్రతినిధులు ఆర్‌డీఓ కార్యాలయం వైపు తరలివచ్చారు. వారిని మధ్యలోనే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులను, ప్రకృతి సంపదను కొల్లగొట్టడమే మీ అభివృద్ధా అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు. మూడు సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటని నిలదీశారు. ఫిషింగ్ హార్బర్, వంశధార లిఫ్ట్ ఇరిగేషన్, వంశధార–నాగావళి అనుసంధానం, ఆఫ్‌షోర్ రిజర్వాయర్, కోడి రామ్మూర్తి స్టేడియం, పాత్రునివలస మల్టీపర్పస్ స్టేడియం వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు తీసుకురాలేకపోయారని విమర్శించారు. సముద్ర ప్రాంతంలో ఒక్క ఫిషింగ్ హార్బర్ మీరు నిర్మించారా, ఎన్నికల్లో జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని చేసిన వాగ్దానాన్ని అమలు చేశారా అని ప్రశ్నించారు. వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ కు 200 కోట్లు కేటాయిస్తే రిజర్వాయర్ ద్వారా రెండు పంటలకు నీరు ఇవ్వవచ్చని, ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. రూ. 100 కోట్లు కేటాయిస్తే వంశధార - నాగావళి అనుసంధానం చెయ్యవచ్చని, ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. ఆఫ్ షోర్ రిజర్వాయర్ కు 20 సంవత్సరాల కాలంలో 19 కిలోమీటర్లు కాలువ గట్టు తవ్వలేకపోయారని నిలదీశారు. 2019లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోడి రామ్మూర్తి స్టేడియం పగలగొట్టి 10 కోట్లు కూడా ఎందుకు కేటాయించలేకపోయారని, పాత్రుని వలస మల్టీపర్పస్ స్టేడియం కోసం 33 ఎకరాలు 2014లో సేకరించి నేటికీ నిధులు ఎందుకు కేటాయించలేదని, పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. వంశధార బ్యారేజ్ శిధిలావస్థకు చేరుకుందని ఆధునీకరణ కోసం 1500 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపినప్పటికీ, చిల్లిగవ్వ కూడా కేటాయించుకోలేకపోయిన మీకు, జిల్లా అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇస్తే అభివృద్ధి జరుగుతుందని అబద్ధపు ప్రచారాలు చేసి మీ పక్కనే ఉన్న కాకరాపల్లిలో ముగ్గురు మనుషులను బలితీసుకొని, 2020 ఎకరాలు బలవంతంగా తీసుకొని ఎన్ని ఫ్యాక్టరీలు నిర్మించారు? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఆ ఫ్యాక్టరీలన్నీ ఆకాశంలో కట్టారా? అని ఎద్దేవా చేశారు. ప్రకృతి వైపరీత్యాలు నుండి జిల్లాను కాపాడడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. జిల్లాలో ఏకకాలంలో నాలుగు పంటలు పండే ఉద్దాన ప్రాంత భూమిని అక్కడ ఉండే ఉద్యానవనాల వల్ల వేలాది మంది రైతులు, కార్మికులు తరతరాలుగా జీవనం పొందుతున్నారని అన్నారు. ఉద్దానంలో విధ్వంసం సృష్టించడమే మీరు చేసిన అభివృద్దా?అని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజల భూములు గుంజుకోవడం కాదని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివర భూముల వరకు నీరిస్తే ప్రజల ఆదాయం పెరుగుతుందని, తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయని, ప్రజలకు ఉపాధి దొరుకుతుందని జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో భూములు జోలికొస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కార్గో వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, కార్యదర్శి జోగి అప్పారావు, వామపక్ష నాయకులు పి. నాగేశ్వరరావు, సీహెచ్. రవి, బి. కుర్మారావు, పోరాట కమిటీ సభ్యులు బత్తిని లక్షణరావు, గుంటు లోకనాథం, లండ రామస్వామి, పొట్టి ధర్మారావు, ఎన్. పరుశురాము, జోగి శ్రీదేవి, ఎల్. సంధ్య, గుంటు రామారావు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)