బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

17న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, సీఎం పర్యటన కోసం పటిష్ట ఏర్పాట్లు : కలెక్టర్‌ కృతికాశుక్లా

1 గంట క్రితం

palnadu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 12:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 17న పల్నాడు జిల్లాలో నిర్వహించనున్న పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జులై 17న నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో నిర్వహించే భారీ రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని తెలిపారు. పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఓవరాల్ సూపర్‌వైజరీ అధికారిగా పర్యవేక్షిస్తారని చెప్పారు. వీఐపీ భద్రత, కాన్వాయ్, బందోబస్తు, రూట్‌ మ్యాప్ ఏర్పాట్లను పోలీసు శాఖ సమర్థంగా నిర్వహించాలని సూచించారు. హెలిప్యాడ్, వేదికలు, వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని పందిళ్ల ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలు పూర్తి చేయాలని ఆదేశించారు. సభా ప్రాంగణంలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా స్పెషలిస్ట్ వైద్యులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచడంతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖకు సూచించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా సమన్వయం, వీవీఐపీ ఆహార పరీక్షల బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. సభకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, అల్పాహారం అందుబాటులో ఉంచాలని సివిల్ సప్లైస్ శాఖను ఆదేశించారు. పర్యటన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, సుందరీకరణ పనులను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ లు పర్యవేక్షించాలని, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు అవసరమైన చోట్ల ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. వేదికల వారీగా ఇంచార్జ్ అధికారులను నియమించి, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్