న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా దుర్భాషలాడటం, కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడిన ఆరోపణలపై ఇద్దరు న్యాయ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాకు చెందిన లక్నో విశ్వవిద్యాలయం మూడో సంవత్సరం న్యాయశాస్త్ర విద్యార్థి, స్వయంగా పిటిషనర్‌గా హాజరైన ప్రబల్ ప్రతాప్ సింగ్ (24), రాయ్‌బరేలి జిల్లాకు చెందిన రెండో సంవత్సరం న్యాయశాస్త్ర విద్యార్థి చందర్ భాన్ (23)లను అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 10న సుప్రీంకోర్టులోని కోర్టు నెం.13లో 'ప్రబల్ ప్రతాప్ అండ్ మరోకరు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్'కు సంబంధించిన ప్రత్యేక అనుమతి పిటిషన్ (సివిల్) విచారణ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్వయంగా పిటిషనర్‌గా హాజరైన ప్రబల్ ప్రతాప్ సింగ్ కోర్టులో దుర్భాషలు ప్రయోగిస్తూ, కాగితాలు విసిరి గందరగోళం సృష్టించాడని, దీంతో విచారణకు అంతరాయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. అతడిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించగా, వారిపై దాడి చేసి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇద్దరు నిందితులను వైద్య పరీక్షల కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐహెచ్‌బీఏఎస్)కు తరలించగా, వారికి తక్షణ మానసిక చికిత్స అవసరం లేదని వైద్యులు నిర్ధారించినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద అభ్యంతరకర పదాలు ఉన్న కరపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుప్రీంకోర్టు భద్రతా సిబ్బందిలోని ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో బిఎన్‌ఎస్ సెక్షన్లు 132, 221, 224, 3(5) కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిద్దరినీ అరెస్టు చేసి, తదుపరి విచారణ నిమిత్తం రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.








కామెంట్‌లు (0)