బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్‌పై ఏడుగంటలపాటు విరుచుకుపడిన అమెరికా

1 గంట క్రితం

iran
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్/టెహ్రాన్ : ఇరాన్‌పై అమెరికా సైన్యం ఏడు గంటలపాటు సాగిన భారీ వైమానిక, నౌకాదళ దాడులను నిర్వహించింది. ఇరాన్‌కు చెందిన డజన్ల కొద్దీ సైనిక లక్ష్యాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లు, నౌకాదళ నౌకలతో అత్యంత కచ్చితమైన దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించింది. మంగళవారం అర్థరాత్రి నుండి ఈ దాడులు చేపడుతున్నట్లు తెలిపింది. హార్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ క్షిపణి, డ్రోన్ స్థావరాలు, నౌకాదళ సామర్థ్యాలు, తీరప్రాంత రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని తెలిపింది. అమెరికా వరుసగా నాలుగో రోజు ఇరాన్‌పై దాడులు కొనసాగించినట్లు అంతర్జాతీయ సముద్ర సంస్థ (ఐఎంఓ) పేర్కొంది.

అమెరికా దాడులకు, ఆంక్షలకు ప్రతిస్పందనగా ఇరాన్ బుధవారం తెల్లవారుజామున బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దిశగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. బహ్రెయిన్‌లో క్షిపణి హెచ్చరిక సైరన్లు మోగగా, కువైట్ తమ వాయు రక్షణ వ్యవస్థలతో క్షిపణులు, డ్రోన్లను కూల్చివేస్తున్నట్లు ప్రకటించింది. జోర్డాన్ వైపు ప్రయోగించిన మూడు క్షిపణులను తమ సైన్యం అడ్డుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్‌ జలసంధిపై ఆంక్ష‍లను వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఇరాన్ ఒక ఒప్పందానికి అంగీకరించకపోతే వచ్చే వారం నుంచి విద్యుత్ కేంద్రాలు, వంతెనలు వంటి కీలక మౌలిక సదుపాయాలపై దాడులను మరింత విస్తరిస్తామని హెచ్చరించారు. ఇరాన్ చమురు, క్రిప్టోకరెన్సీ రంగాలపై అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. పెట్రోలియం షిప్పింగ్‌కు సంబంధించిన మహమ్మద్ హుస్సేన్ షమ్ఖానీ నెట్‌వర్క్‌తో పాటు ఇరాన్ చమురు రంగాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షలు విధించినట్లు అమెరికా ట్రెజరీ శాఖ వెల్లడించింది. అలాగే ఇరాన్ సెంట్రల్ బ్యాంక్‌తో అనుసంధానమై ఉన్న డిజిటల్ వాలెట్లలోని 130 మిలియన్ డాలర్ల ఆస్తులను స్తంభింపజేసినట్లు ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ తెలిపారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్