మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయ డెయిరీ ఎన్నికలు నిర్వహించాల్సిందే

5 గంటల క్రితం

విజయ డెయిరీ బోర్డుకు హైకోర్టు షాక్‌
చైర్మన్‌ దాసరి సహా ఐదుగురు డైరెక్టర్ల ఎన్నిక చెల్లదని తీర్పు
కోరం నిబంధనల ఉల్లంఘనపై కీలక ఆదేశాలు
‘విజయ’ దాఖలు చేసిన రెండు రిట్‌ పిటిషన్లు కొట్టివేత image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎపి కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులకు హైకోర్టు సమర్థన

ప్రజాశక్తి-అమరావతి : కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం (విజయ డెయిరీ) డైరెక్టర్ల ఎన్నికలను తిరిగి నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు డైరెక్టర్ల ఎన్నికను రద్దు చేస్తూ, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఎపి కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ తీర్పు వెలువరించారు. భార్య వ్యాపార సంస్థకు సహకార సంఘంతో ఉన్న లావాదేవీలను కారణంగా చూపి, ఆ సంస్థతో ఎలాంటి ఒప్పంద సంబంధం లేని భర్త నామినేషన్‌ను తిరస్కరించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. డైరెక్టర్ పదవికి వీరపనేని శివరామ ప్రసాద్ నామినేషన్ల తిరస్కరణను తప్పుపడుతూ దాఖలైన వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు, ట్రిబ్యునల్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

ట్రిబ్యునల్ ఆదేశాలను సవాలు చేస్తూ డైరెక్టర్లు దాసరి వెంకట బాలవర్ధనరావు, వేమూరి సాయి వెంకట రమణ, కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం దాఖలు చేసిన రెండు వ్యాజ్యాలను కొట్టివేసింది. వీరపనేని శివరామ ప్రసాద్ భార్య పద్మజ రాట్నాలమ్మ డెయిరీ పేరుతో ఏకైక యాజమాన్య సంస్థను నిర్వహిస్తున్నా రు. ఈ సంస్థకు విజయ డెయిరీతో పాల శీతలీకరణకు సంబంధించిన వ్యాపార ఒప్పందం ఉండేది. ఆ సంస్థకు రూ.4.26 కోట్ల బకాయిలున్నాయనే కారణంతో 2022 ఆగస్టు 24న జరిగిన డైరెక్టర్ల ఎన్నికల్లో శివరామ ప్రసాద్ దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. 2023 ఆగస్టు 7న మరోసారి డైరెక్టర్ పదవికి నామినేషన్ దాఖలు చేయగా, రాట్నాలమ్మ డెయిరీకి రూ.5.30 కోట్ల బకాయిలున్నాయని, నామినేషన్‌ను ప్రతిపాదించిన వ్యక్తులు గత రెండు జనరల్ బాడీ సమావేశాల్లో ఒకదానికి హాజరుకాలేదని ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీనిపై శివరామ ప్రసాద్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్, నామినేషన్ తిరస్కరణను తప్పుపట్టి, ఇద్దరు డైరెక్టర్ల ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించా లని ఆదేశించింది.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్నికైన డైరెక్టర్లు, సహకార సంఘం హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి వ్యక్తిగత హామీ లేదా ఒప్పంద బాధ్యత లేని భర్తపై భార్య సంస్థ బకాయిలను మోపడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ, వాటిని సవాలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్