- ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి భార్య, పిసిపి అధ్యక్షురాలిపై సామాజిక మాధ్యమాల్లో అత్యంత అసభ్యకరంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె కోరారు. జనసేనకు చెందిన కొందరు వ్యక్తులు ఎక్స్ స్పేస్లో మాజీ సిఎం వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజానికే తలవంపులని సావిత్రి పేర్కొన్నారు. గతంలో టిడిపికి చెందిన మహిళలపైనా ఇదే తరహాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలను అరికట్టడంలో అధికార పార్టీలదే కీలక బాధ్యతని, ఆయా పార్టీల అండతోనే ఇటువంటి శక్తులు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. ఉన్నతస్థాయి రాజకీయ నాయకుల కుటుంబాల్లోని మహిళలపైనే ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తుంటే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్యపైనా ఇలాంటి జుగుప్సాకర వ్యాఖ్యలు చేసినప్పుడు ఐద్వా తీవ్రంగా స్పందించిందని గుర్తుచేశారు. ఆనాడు స్పందించిన చంద్రబాబు ఇప్పుడు కూడా స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతమాత గురించి మాట్లాడే బిజెపి నాయకులు మహిళలపై జరుగుతున్న ఇటువంటి దాడుల విషయంలో మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీల అండతో ఇలాంటి అరాచక శక్తులు మరింతగా రెచ్చిపోతున్నాయని, రాప్తాడు వంటి ఘటనలకు ఇటువంటి శక్తులే కారణమని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని మహిళా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో సమావేశం జరిపి కార్యాచరణ నిర్ణయిస్తామని పేర్కొన్నారు.








కామెంట్లు (0)