- పూజ గదిలో వెలిగించిన దీపం నుంచి మంటలు వ్యాపించినట్లు అనుమానం
ప్రజాశక్తి – పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రం పరవాడలోని బీసీ కాలనీలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక ఉన్న బీసీ కాలనీలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన పూరిల్లు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించిన అనంతరం ఇంటి యజమానులు తలుపులకు తాళం వేసి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పూజ గదిలో వెలిగించిన దీపం నుంచి నిప్పురవ్వలు పూరింటికి అంటుకుని మంటలు వ్యాపించి ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. చూస్తుండగానే మంటలు ఇంటి మొత్తం వ్యాపించి పూరిల్లు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. అగ్నిప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల కాలనీవాసులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ పూరిల్లు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ఇంట్లోని సామగ్రి దగ్ధమై తీవ్ర ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లు స్థానికులు భావిస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన నివాసం అగ్నిప్రమాదంలో దగ్ధం కావడంతో బాధిత కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రమాదంపై విచారణ జరిపి నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ పరంగా తగిన సహకారం అందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.








కామెంట్‌లు (0)